2020లో అమెరికా అధ్యక్షుడిగా ఓడిపోయిన డోనాల్డ్ ట్రంప్ తాజాగా మళ్లీ నేను 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తానన్నారు. భారత్ కు చెందిన ప్రముఖ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈవిషయాన్ని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ నేను రాబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని కోరుకుంటున్నారు. ప్రజా మద్దతు ఇప్పటికీ నాకే గణనీయ స్థాయిలో ఉందని గణాంకాలను బట్టి తెలుస్తోంది. దీనిపై నేను సమీప భవిష్యత్తులో తగిన నిర్ణయాన్ని తీసుకుంటాను అని ట్రంప్ తెలిపారు.
మునుపటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఇప్పటి అధ్యక్షుడు జో బైడెన్ కంటే నాతోనే భారత్ కు మెరుగైన ఆర్ధిక, రాజకీయ సంబంధాలు మెరుగపడ్డాయన్నారు. భారతదేశానికి నన్ను మించిన మంచి మిత్రుడు మరొకడు లేడు. ఈ విషయాన్ని మీరు ప్రధాని మోడీని అడిగి కూడా తెలుసుకోవచ్చు అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీతో, భారత్ తో ఉన్న సత్సంబంధాల వల్ల తనకు గత అధ్యక్ష ఎన్నికల్లోనూ భారత సంతతి ప్రజల నుంచి భారీ మద్దతు లభించిందని ట్రంప్ గుర్తు చేసుకున్నారు. ఈసందర్భంగా ప్రధాని మోడీపై ట్రంప్ ప్రశంసల జల్లు కురిపించారు. మోడీ చాలా మంచి మనిషి. ఆయనతో నాకు మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి.
మరోసారి అమెరికా అధ్యక్షుడైతే మీ ప్రాధాన్యాలు ఏమిటని ట్రంప్ ను ప్రశ్నించగా.. అమెరికాను ఇంధన సాధికార దేశంగా తీర్చిదిద్దుతా అని స్పష్టం చేశారు. ఇంధన అవసరాల కోసం ఇతర దేశాలపై ఆధారపడకుండా స్వతంత్రంగా అమెరికా నిలదొక్కుకోవాలి అనేది నా ఆశయమన్నారు. ప్రస్తుత జో బైడెన్ సర్కారు దాన్ని సమీప కాలంలోనూ సాధించే పరిస్థితి లేనే లేదు అని పేర్కొన్నారు. ఉద్యోగ కల్పన పెంచడంలోనూ, నిరుద్యోగిత రేటును తగ్గించడంలో బైడెన్ సర్కార్ ప్రయత్నిస్తలేదన్నారు. రష్యా ఉక్రేయిన్ మధ్య జరుగుతున్న వార్‌ను ముగింపు దిశగా ప్రయత్నాలు చేయలేకపోవడం చాలా భాదాకరమన్నారు.