ఇవాళ ఉదయం కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ తడిసి ముద్దైంది.హైదరాబాద్ లోని యూసఫ్ గూడలో అత్యధికంగా 2 గంటల్లోనే 12 సెంటీమీటర్ల వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కృష్ణానగర్ ప్రాంతమంతా మినీ చెరువును తలపించగా డ్రైనేజీలు, నాలాలు పొంగి పొర్లుతున్నాయి. పార్సిగుట్ట నుంచి రామ్ నగర్ లోని ఆశీర్వాద్ అపార్ట్ మెంట్స్ వద్దకు ఓ వ్యక్తి మృతదేహం కొట్టుకుని వచ్చింది. ఆ వ్యక్తిని రామ్ నగర్ కు చెందిన అనిల్ గా గుర్తించారు.
జీహెచ్ఎంసీ పరిధిలో రెడ్ అలర్ట్ జారీ చేయగా ఇప్పటికే నగరంలోని స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు. సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తువరకూ ఆవర్తనం విస్తరించి ఉందని, దాని ప్రభావంతోనే వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది.
హైదరాబాద్‌కు మళ్లీ భారీ వర్షం ముప్పు పొంచి ఉందని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ తో పాటు జోగులాంబ గద్వాల, జనగాం, మహబూబ్ నగర్, మెదక్, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, సిద్ధిపేట, వనపర్తి, జనగాం జిల్లాలకు భారీ వర్షసూచన ఉన్నట్లు తెలిపింది. హైదరాబాద్ లో అత్యవసర సేవల కోసం టోల్ ఫ్రీ నంబర్లు 040-21111111, 9000113667 ఏర్పాటు చేశారు.
Also Read:సీఎం రేవంత్ రెడ్డితో గవర్నర్ దత్తాత్రేయ భేటీ