న్యూఇయర్ వేడుకలు..నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

32
police

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నగరంలోని బేగంపేట ఫ్లై ఓవర్‌ మినహా మిగితా ఫ్లై ఓవర్‌లన్నింటిని మూసివేస్తున్నట్లు ప్రకటించారు పోలీసులు. 1వ తేదీ తెల్లవారుజాము 2 గంటల వరకు బస్సులు, లారీలు ఇతర భారీ వాహనాలకు నగరంలోకి అనుమతి లేదన్నారు.

డ్రంకెన్‌ డ్రైవ్‌, ర్యాష్‌ అండ్‌ నెగ్లెజెంట్‌ డ్రైవింగ్‌, అతి వేగం, ట్రిపుల్‌ రైడింగ్‌ ఉల్లంఘనలను సీరియస్‌గా తీసుకుంటామని, వీటిని అడ్డుకోవడానికి ప్రత్యేకంగా తనిఖీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. డ్రంకెన్‌ డ్రైవ్‌ చేసి రోడ్డు ప్రమాదానికి కారకులైతే పదేండ్ల జైలు శిక్ష పడుతుందని పోలీసులు వెల్లడించారు.

పలు చోట్ల దారి మళ్లింపు….

()పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై ఎయిర్‌పోర్టు వెళ్లే వారికి మినహా మిగతా వాళ్లకు అనుమతి లేదు.
()సైబర్‌టవర్స్‌ ఫ్లైఓవర్‌, గచ్చిబౌలి ఫ్లైఓవర్‌, బయో డైవర్సిటీ ఫ్లైఓవర్‌ 1, 2, మైండ్‌ స్పేస్‌ ఫ్లైఓవర్‌, ఫోరమ్‌మాల్‌,జేఎన్‌టీయూ ఫ్లైఓవర్లు, రోడ్‌ నెం.45, ()దుర్గం చెరువు బ్రిడ్జిలు రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు పూర్తిగా మూసివేస్తారు.
()నెక్లెస్‌రోడ్డు, ఎన్టీఆర్‌ మార్గ్‌ వైపునకు ఖైరతాబాద్‌ వైపు నుంచి వచ్చే వాహనాలు వీవీ విగ్రహాం వద్ద ఖైరతాబాద్‌,రాజ్‌భవన్‌ వైపు నుంచి వెళ్లాలి.
()బీఆర్‌కే భవన్‌ నుంచి ఎన్టీఆర్‌మార్గ్‌ వైపు వచ్చే వాహనాలు తెలుగు తల్లి జంక్షన్‌ వద్ద ఇక్బాల్‌ మినార్‌,లక్డీకపూల్‌ వైపు నుంచి వెళ్లాలి.
()లిబర్టీ నుంచి అప్పర్‌ ట్యాంక్‌బండ్‌కు వచ్చే వారు అంబేద్కర్‌ విగ్రహాం వద్ద నుంచి తెలుగుతల్లి చౌరస్తా,ఇక్బాల్‌ మినార్‌ వైపు నుంచి రవీంద్రభారతి వైపు వెళ్లాలి.
()ఖైరతాబాద్‌ మార్కెట్‌ నుంచి నెక్లెస్‌ రోడ్‌ వైపు వచ్చే వాహనాలు ఖైరతాబాద్‌ బడా(బడా గణేశ్‌) వద్ద సెన్సేషన్‌ థియేటర్‌, రాజ్‌దూత్‌, లక్డీకపూల్‌ వైపు వెళ్లాలి.
() మింట్‌కంపౌండ్‌ నుంచి సచివాలయం వెళ్లే లైన్‌లోకి సాధారణ వాహనదారులకు అనుమతి ఉండదు. ఈ రోడ్డు మూసేస్తారు.
()నల్లగుట్ట రైల్వే బ్రిడ్జి నుంచి సంజీవయ్య పార్కు, నెక్లెస్‌ రోడ్డు వైపు వాహనాలకు అనుమతి ఉండదు. ఈ వాహనాలను కర్బాల మైదాన్‌, మినిస్టర్‌ రోడ్డుకి మళ్లిస్తారు.
()సికింద్రాబాద్‌ వైపు నుంచి వచ్చే వాహనాలను షెయిలింగ్‌ క్లబ్‌ వద్ద కవాడిగూడ క్రాస్‌రోడ్డు వైపు మళ్లిస్తారు.