నగరంలో బుధవారం ఉదయం నుంచి మెట్రో రైలు ప్రయాణాన్ని ప్రారంభించింది. ఉదయం ఆరు గంటలకు ఒక రైలు నాగోలు స్టేషన్లో, మరో రైలు మియాపూర్ స్టేషన్లో బయల్దేరాయి. మెట్రోలో తొలిరోజు ప్రయాణించేందుకు ప్రజలు ఉత్సాహం చూపిస్తున్నారు. మొదటి రోజు సుమారు లక్షమంది ప్రయాణించే అవకాశం ఉందని అంచనా వేశారు. ప్రతి పావుగంటకో రైలు చొప్పున మొత్తం 18 రైళ్లు తిరుగుతాయి.
మెట్రో కార్డుల విక్రయం మొదలుపెట్టిన తర్వాత మూడు రోజుల్లోనే 12 వేలకుపైగా అమ్మడయ్యాయి. తొలిరోజు మెట్రో రైలులో లక్ష మంది ప్రయాణించవచ్చని భావిస్తున్నారు. రద్దీకి అనుగుణంగా మొదటి రోజే రైళ్ల సంఖ్యను పెంచాల్సి రావచ్చని ఎల్అండ్టీ ప్రతినిధి ఒకరు తెలిపారు. తదనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మియాపూర్-నాగోలు 27.6 కిలోమీటర్ల మార్గంలో మొత్తం 24 మెట్రో స్టేషన్లున్నాయి. వీటి మధ్య ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలంటే ప్రస్తుతం గంటా 50 నిమిషాలు పడుతోంది. అదే మెట్రోలోనైతే 64 నిమిషాల్లోనే ఆ చివరి నుంచి ఈ చివరికి చేరుకోవచ్చు. సాంకేతిక సర్దుబాట్ల తర్వాత ఈ సమయం మరింత తగ్గుతుందని మెట్రో వర్గాలు చెప్పాయి.
స్మార్ట్ కార్డును తిరిగిస్తే… రూ.80 వెనక్కి: మెట్రో ప్రయాణానికి ఎల్అండ్టీ అధికారులు కొన్ని స్టేషన్లలో స్మార్ట్ కార్డులను విక్రయిస్తున్నారు. వీటిని కొనేందుకు రూ.200 చెల్లించాలి. ఇందులో రూ.100తో రీఛార్జి చేస్తారు. కార్డుకు రూ.100 తీసుకుంటారు. ఒకవేళ ఈ కార్డును మెట్రోస్టేషన్ కౌంటర్లో తిరిగి ఇచ్చేస్తే, రూ.80 వెనక్కు ఇస్తారు. ఉదయం ఆరింటికి రైళ్లు తిరగడం ప్రారంభమవుతున్నందున… ఐదు గంటల నుంచే కార్డుల్లో డబ్బులను రీఛార్జి చేసుకునే అవకాశం కల్పించారు.