425 ఏళ్ల చారిత్రక హైదరబాద్ నగరం.. గుర్రపు బగ్గీలతో ప్రారంభమైన నగర ప్రస్థానం మెట్రో రాకతో సమున్నత శిఖరానికి చేరింది. నగర జనాభా కోటికి, ప్రైవేట్ వ్యక్తిగత వాహనాలు దాదాపు అరకోటికి చేరి నిత్యం ట్రాఫిక్ తో నరక యాతన అనుభవిస్తున్న నగరవాసులకు మెట్రో రాక గొప్ప ఊరట కలిగించింది. అత్యాధునిక సాంకేతిక అద్భుతంగా హైదరాబాద్ మెట్రో దేశానికే తలమానికంగా నిలిచింది. అభివృద్ధి చెందిన దేశాల సాంకేతికత, నిర్వహణ నైపుణ్యాలు, అత్యాధునిక భద్రతా ప్రమాణాలతో, దాదాపు 15 లక్షల మందికి రవాణా సేవలందించే విస్తృత ఏర్పాట్లతో హైదరాబాద్ మెట్రో పరిపుష్టమైంది.
తాజాగా హైదరాబాద్ మెట్రో తొలి దశలో తుది ఘట్టం ఆవిష్కృతమైంది. ఎల్బీనగర్ – మియాపూర్, జేబీఎస్ – ఎంజీబీఎస్, నాగోల్ – హైటెక్ సిటీ మార్గాల్లో (66 కి.మీ) చిట్టచివరి పిల్లర్ ఏర్పాటు ప్రక్రియ పూర్తయింది. ఈ అరుదైన ఘట్టానికి ఎంజీబీఎన్ చిరునామాగా నిలిచింది.
ప్రపంచంలో ఇప్పటివరకు ఒకే ప్రాజెక్టులో ఒక సంస్థ 2,599 పిల్లర్లను నిర్మించిన చరిత్ర లేదని మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. ప్రాజెక్టులో భాగంగా తొలి పిల్లర్‌ను 2012 ఏప్రిల్ 19న ఉప్పల్ జెన్‌ప్యాక్ట్ (పిల్లర్ నెంబర్ 19) వద్ద ఏర్పాటు చేశామని వెల్లడించారు. నాటినుంచి 2019 మే 19 వరకు 2,599 రోజుల్లో 2,599 పిల్లర్లు నిర్మించి సగటున ప్రతీరోజు ఒక పిల్లర్‌ను పూర్తిచేసి ప్రపంచ మెట్రోరైలు ప్రాజెక్టు నిర్మాణాల్లో హైదరాబాద్ మెట్రో ప్రత్యేకతను చాటుకున్నదని వివరించారు.
సాంకేతిక అవసరాలు..స్ధానిక పరిస్థితులు బట్టి వివిధ ఆకృతుల్లో పిల్లర్లను నిర్మించామని ఆయన వెల్లడించారు. 2599 పిల్లర్లలో సాధారణమైన పిల్లర్లు 1,569 కాగా కాంటిలెవర్ పిల్లర్లు 224, స్టేషన్ పిల్లర్లు 602, హామర్ హెడ్ పిల్లర్లు 51, పోర్టల్ పిల్లర్లు 153 నిర్మించినట్టు పేర్కొన్నారు.
అనేక సవాళ్లు, ప్రతిబంధకాలు, ఆస్తుల సేకరణసమస్యలు, న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొని కారుచీకటిలోకాంతిపుంజంలా దూసుకొచ్చిన మెట్రో ప్రాజెక్టు నగరంలో ఏడేళ్ల సుదీర్ఘ ప్రయాణం కొనసాగించిందన్నారు.