పోలీసు అమర వీరులను స్పూర్తిగా తీసుకోవాలని అన్నారు రాచకొండ సీపీ మహేష్ భగవత్. అక్టోబర్ 21 పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఈరోజు అంబర్పేట్ పోలీస్ హెడ్ క్వార్టర్ లో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రక్తదాన శిబిరాన్ని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ప్రారంభించారు. కమిషనర్ మహేష్ భగవత్ తో పాటు పోలీసులు అధిక సంఖ్యలో రక్తదానం చేయడానికి ముందుకు వచ్చారు. అనంతరం పోలీస్ అమరవీరులను స్మృతిస్తూ, ఎల్బీనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అంజి పల్లి నాగ మల్లు స్వయంగా రచించి గానం చేసిన పాటల సీడీని కమిషనర్ మహేష్ భగవత్ ఆవిష్కరించారు.
అనంతరం పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ మాట్లాడుతూ.. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకొని ప్రతి సంవత్సరం చాలా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము. దీనిలో భాగంగా ఈరోజు మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నాము గత మూడు సంవత్సరాలుగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో 500 మంది పోలీస్ సిబ్బంది ఈ రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతేకాకుండా నగరంలో ఏదైనా ఎమర్జెన్సీ బ్లడ్ అవసరం ఉన్నప్పుడు మా సిబ్బంది వెళ్లి రక్తదానం చేస్తూ సేవ చేస్తారని. మా సేవలు గుర్తించి గత రెండు సంవత్సరాలుగా గవర్నర్ చేతుల మీదుగా మా కమిషనరేట్కి బెస్ట్ బ్లడ్ డోనర్ అవార్డు ఇవ్వడం జరిగిందని అన్నారు.
పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా రాచకొండ పరిధిలో ఉన్న 17 మంది అమరవీరుల కుటుంబాలకు వారి సంక్షేమానికి మేము ఎప్పుడు ముందు ఉంటాము అని తెలిపారు. అలానే గత వారం రోజులుగా రాచకొండ ట్రాఫిక్ పోలీసులు మరియు షి టీం వాళ్ళు వివిధ పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇవాళ రక్తదానం చేయడానికి వచ్చిన పోలీసు సిబ్బందికి ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ dr. పిచ్చిరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీసీపీ క్రైమ్స్ యాదగిరి, డీసీపీ ట్రాఫిక్ దివ్య చరణ్ రావు, డీసీపీ ఆడ్మిన్ శిల్పవల్లి, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు సిహెచ్ భద్రా రెడ్డి, జాయింట్ సెక్రటరీ టి. వెంకటయ్య, క్రిష్ణా రెడ్డి, అడిషనల్ డీసీపీలు శంకర్ నాయక్, శమీర్, ఎడిషన్ డీసీపీ షిటీం సలీమా, క్రైమ్ ఏసీపీ హరినాధ్ తదితరులు పాల్గొన్నారు.