హరిత తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ నిత్యం కృషి చేస్తున్నారు. తెలంగాణలో పచ్చదనం ఉట్టిపడేలా.. భవిష్యత్ తరాలకు స్వచ్చమైన వాతావరణం అందించాలనే తలంపుతో హరితహారం అనే కార్యక్రమాన్ని చేపట్టి కోట్ల సంఖ్యలో మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు కేసీఆర్.
విజయవంతంగా కొనసాగుతున్న హరితహారంతో తెలంగాణ ఆకుపచ్చగా మారుతోంది. ఎక్కడ చూసినా పచ్చదనమే పలుకరిస్తోంది. హరిత తెలంగాణ కోసం ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి మరో అరుదైన గుర్తింపు లభించింది. ఆర్బర్ డే ఫౌండేషన్ అనే సంస్థ.. 2021 ట్రీ సిటీగా హైదరాబాద్‌ను ప్రకటించింది. హరితహారం విజయవంతం అయిందనడానికి ఈ గుర్తింపే నిదర్శనం.
ఈ సందర్భంగా గ్రీన్ ఛాలెంజ్ స్థాపించిన ఎంపీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్‌గా హైదరాబాద్‌ను ఆర్బర్ డే ఫౌండేషన్ గుర్తించడం చాలా సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఆర్బర్ డే ఫౌండేషన్ ట్రీ సిటీ జాబితాలో ఇండియా నుంచి హైదరాబాద్ నగరం ఒక్కటే ఎంపిక కావడం విశేషం. హరితహారం,గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా పచ్చదనాన్ని పెంచేందుకు తాము చేసిన ప్రయత్నాలకు ఇది గుర్తింపు అని ఎంపీ సంతోష్ తెలిపారు. హరితహారం,గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాల్లో పాల్గొని మొక్కలు నాటిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.