హుజుర్‌నగర్ ప్రజా కృతజ్ఞత సభలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు సీఎం కేసీఆర్. ఈ సభలో హుజుర్ నగర్ అభివృద్ధి కోసం దాదాపు రూ. 100 కోట్ల నిధులను విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన సీఎం…హుజుర్‌నగర్‌లో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
ఇందులో భాగంగా సూర్యాపేట జిల్లాలో కొత్తగా హుజూర్ నగర్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటైంది. ఈమేరకు రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. 7 మండలాలతో హుజుర్‌నగర్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తున్నట్లు నోటిఫికేషన్ విడుదల కాగా హుజుర్ నగర్, మట్టపల్లి, మేళ్ల చెరువు, చింతలపాలెం, గరిడెపల్లి,పాలకిడు,నేరెడుచెర్ల మండలాలతో ఏర్పాటుచేశారు.దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ప్రజా కృతజ్ఞత సభలో హుజుర్‌నగర్‌లోని 136 గ్రామ పంచాయతీలకు ఒక్కో గ్రామ పంచాయతీకి 20 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో పాటు 7 మండల కేంద్రాలకు ప్రతీ మండల కేంద్రానికి 30 లక్షలు,హుజుర్ నగర్ మున్సిపాలిటీకి 25 కోట్లు ,నేరేడుచర్ల మున్సిపాలిటీకి రూ. 15 కోట్లు మంజూరు చేస్తామని తెలిపారు.
హుజుర్‌నగర్‌లో గిరిజన రెసిడెన్షియల్ స్కూల్,బంజార భవన్ నిర్మాణం ,ప్రజా దర్బార్ ద్వారా పోడు భూముల సమస్యల పరిష్కారం, కేంద్రంతో మాట్లాడి ఈఎస్‌ఐ ఆస్పత్రి మంజూరు చేస్తామన్నారు. పాలిటెక్నిక్ కాలేజీ, కోర్టును ఏర్పాటుచేస్తామని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో పెద్దపీట వేస్తామని చెప్పారు. చెప్పిన విధంగానే ఒక్కో హామీని నెరవేరుస్తున్నారు సీఎం.