సీఎం కేసీఆర్ పుట్టిన రోజున తెలంగాణ జాగృతి అవయవదానం అనే బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అవయవదానం చేయండి మరొకరిని బ్రతికించండి అనే నినాదంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. కేసీఆర్ బర్త్ డే సందర్భంగా ఎంపీ కవితతో పాటు రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ తొలి సంతకాలు చేసి అవయవదానంపై అవగాహన కల్పించడమే కాదు ఏడాదిలో 50 వేల మందితో అవయవదాన ప్రతిజ్ఞలు చేయించడమే లక్ష్యంగా ముందుకుసాగుతున్నారు.
అవయవ మార్పిడి కోసం ఎదురు చూసే వారికి అపన్న హస్తం జీవన్ ధాన్. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి సకాలంలో అవయవాలను మార్పిడి చేయించి వారికి పునర్జన్మ ప్రసాదించడం,బాధిత కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపడమే జీవన్‌దాన్ ప్రత్యేకత. గుండె, కిడ్నీ, కాలేయం, ఊపిరితిత్తులు, కార్నియాల మార్పిడీల సంఖ్యను పెంచుతూ బాధితులకు పునర్జన్మ కల్పిస్తోంది.
ఈ నేపథ్యంలో తెలంగాణ జాతిపిత కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా అవయవదానంపై తెలంగాణ జాగృతి, నిమ్స్ ఆధ్వర్యంలోని జీవన్‌దాన్ సంస్థతో ఒప్పందం చేసుకుని ఈ బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అవయవదాన సంకల్పం కార్యక్రమానికి మొదటిరోజే అద్బుతమైన స్పందనవచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4,353 మంది అవయవదానం చేయడానికి ముందుకొచ్చారు. ప్రజలు, ప్రముఖులు, టీఆర్‌ఎస్ కార్యకర్తలు, సీఎం కేసీఆర్ అభిమానులు, యువతీయువకులు స్వచ్ఛందం గా ముందుకొచ్చి సమ్మతి పత్రాలపై సంతకాలు చేశారు. ఏడాదిపాటు నిరంతరాయంగా జరిగే ఈ కార్యక్రమానికి రోజురోజుకి మంచిస్పందనవస్తోంది.
అవయవ మార్పిడిలో జీవన్‌ధాన్ పాత్ర ఎంతో కీలకమైనది. జీవన్‌ధాన్ లేకుండా అవయవ మార్పిడి సాధ్యం కాదు. ఒకవేళ సాధ్యమైనా అది ఎంతో ఖర్చుతో కూడుకున్నది. అంతే కాకుండా తీవ్ర అవకతవకలు జరిగే అవకాశాలుండటంతో 2012లో జీవన్‌దాన్‌ను ప్రభుత్వం ఏర్పాటుచేసింది.
ప్రస్తుతం హైదరాబాద్‌లో 27 ఆస్పత్రులు అవయవదానంలో పాలుపంచుకుంటున్నట్లు జీవన్ దాన్ ఇంచార్జీ స్వర్ణలత తెలిపారు. సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా ఎంపీ కవిత,సంతోష్ కుమార్ ఇచ్చిన పిలుపుమేరకు ప్రజల్లో అవయవదానంపై అవగాహన వచ్చిందన్నారు. గతంలో కంటే చాలామంది అవయవదానంపై ముందుకువస్తున్నారని చెప్పారు.
జీవన్‌దాన్ సంస్థ ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు మొత్తం 675 అవయవాలను సేకరించామన్నారు అందులో కిడ్నీలు-265, కాలేయాలు-143, గుండెలు-13, గుండె నాళాలు(హార్ట్‌వాల్వ్స్)-132, ఊపిరితిత్తులు-6, పాంక్రియ-1, కళ్లు-115ని 150మంది దాతల నుంచి సేకరించి 664మందికి జీవం పోశారు. ప్రస్తుతం ఆ సంఖ్య 2,459కి చేరగా వేలసంఖ్యలో ప్రజలు అవయవదానం చేస్తామని ప్రతిజ్ఞచేస్తూ సంతకాలు చేస్తున్నారని చెప్పారు.
జీవన్‌దాన్‌లో నమోదు చేసుకున్న ఆసుపత్రులకు మాత్రమే సంస్థ ప్రతినిధులు అవయవాల దానానికి సంబంధించిన సమాచారాన్ని ఇస్తారు. జీవన్‌ధాన్‌లో నమోదైన ఆసుపత్రుల్లో చేరిన ఎవరైన రోగికి అవయవాలు కావాల్సి ఉంటే వెంటనే వారి పేరును సదరు ఆసుపత్రికి అనుబంధంగా జీవన్‌దాన్ ప్రతినిధులు నమోదు చేసుకుంటారు. ఏదైనా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రిలో రోగి బ్రెయిన్‌డెడ్‌కు గురైనట్లు సంబంధిత వైద్యులు ధ్రువీకరిస్తే వెంటనే ఆ సమాచారాన్ని వైద్యులు జీవన్‌దాన్ సంస్థకు చేరవేస్తారు. విషయం తెలుసుకున్న జీవన్‌దాన్ బృందం బ్రెయిన్‌డెడ్‌కు గురైన వ్యక్తి వద్దకు చేరుకుని అతడి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. కుటుంబ సభ్యులు అతడి అవయవాలను దానం చేయడానికి అంగీకరిస్తే అందుకు సంబంధించిన డాక్యుమెంటరీ ప్రక్రియ పూర్తిచేసి వెంటనే అవయవ దాతకు సంబంధించిన వయసు, బ్లడ్‌గ్రూప్ వివరాలు సేకరిస్తారు. అవయవాలను సేకరించే దగ్గరి నుండి సేకరణ పూర్తై దాత మృతదేహాన్ని తరలించే వరకు జీవన్‌దాన్ బృందం సంబంధిత వ్యక్తి కుటుంబ సభ్యులతోనే ఉంటుందని ఆమె వెల్లడించారు.
దీంతో పాటు పోలీసుల సహకారంతో మరో జన్మ అనే కార్యక్రమాన్ని సైతం చేపట్టామన్నారు స్వర్ణలత. ఈ కార్యక్రమం ద్వారా పోలీస్ శాఖ సహకారంతో అవయవదానం చేసేలా చర్యలు చేపట్టడంతో పాటు యాక్సిడెంట్‌లతో ప్రమాదాల భారీ పడి అత్యవసరంగా హెల్ప్ కావాల్సిన వారికి సాయం చేయగలిగామన్నారు. పోలీస్ శాఖ,సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ సహకారంతో మంచిఫలితాలు రాబట్టమన్నారు. అవయవదానంలో తమిళనాడు కంటే ముందుకు వెళ్ళామని… తెలంగాణ ప్రభుత్వ సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా అవయవదానంపై అవగాహన సదస్సులు విస్తృతంగా చేపట్టడం శుభపరిణామం అని తెలిపారు.