తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత దాదాపు 75 రోజుల పాటు అపోలో ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి…చివరకు తుది శ్వాస విడిచారు. ఇక సెలవంటూ తిరిగిరాని లోకాలకు వెళ్లారు. తమిళనాడు ప్రజలకు..కార్యకర్తలకు..దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులకు అమ్మ శోక సంద్రాన్ని మిగిల్చారు. దేశ రాజకీయ చరిత్రలో కీలక నాయకురాలిగా ఎదిగిన తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం తొలి నుంచి దక్షిణాది రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. తమిళనాడు రాజకీయాలను ఆమె శాసించారు.. తన పాలనతో ఆమె తమిళనాట రాజకీయాల్లో పేదల హృదయాల్లో సుస్థిరస్థానం పొందారు.
అయితే జయలలిత మృతిపై అనుమానాలు ఉన్నాయని వాటిని క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేయాల్సిందిగా నటి గౌతమి… ప్రధాని మోడీకి ఒక లేఖ రాశారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆస్పత్రిలో 75 రోజులు చికిత్స తీసుకుంటే హెల్త్ బులిటెన్స్ విడుదల చేయడం తప్ప ఆమెకు సంబంధించిన ఏ ఒక్క ఫోటోను గానీ, విజువల్‌ని గాని ఆస్పత్రి యాజమాన్యం విడుదల చేయలేదని గౌతమి లేఖలో పేర్కొన్నారు. జయను ఎప్పుడైనా డిశ్చార్జి కావొచ్చని డాక్టర్ చెప్పారని గౌతమి గుర్తుచేశారు. వీటన్నింటినీ పేర్కొంటూ నటి గౌతమి ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఆకస్మాతుగా గుండెపోటు రావడం.. ఆ మరుసటి రోజే జయలలిత కన్నుమూయడంపై గౌతమి అనుమానాలు వ్యక్తం చేశారు.
జయ మృతి వెనుక ఉన్న నిజనిజాలను కప్పిపుచ్చడానికి యత్నిస్తున్నారని.. ఆస్పత్రిలో ఉన్నప్పుడు జయలలితను ఎవరికీ చూపించలేదని, ఆమెని కలవాలని వెళ్లిన ప్రముఖులు ఎవరూ ఆమె బాగానే ఉన్నారన్న విషయాన్ని నేరుగా చెప్పలేదని గౌతమి లేఖలో పేర్కొన్నారు. తమిళనాడు ప్రజలకు ఆరాధ్యురాలైన జయలలిత గురించి ఇంత గోప్యంగా ఎందుకు ఉంచాల్సి అవసరం వచ్చింది.. జయను కలవకూడదని ఏ అధికారం చెప్పింది, ఆమె చికిత్సపై ఎవరు నిర్ణయాలు తీసుకున్నారు.. అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పేవారెవరని గౌతమి ప్రశ్నించారు. ప్రజలు ఎన్నుకున్న నేతల గురించి తెలుసుకునే హక్కు వారికి ఉంటుందని.. జయ మరణం సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోకూడదని గౌతమి అన్నారు. మోడీ ఎవరికీ భయపడని, ప్రజలకోసం నిలబడే నేత అని.. తన విన్నపానికి స్పందించి ప్రజల్లో ఉన్న సందేహాన్ని నివృత్తి చేసేలా చర్యలు తీసుకోవాలని నటి గౌతమి మోడీకి లేఖలో తెలియజేశారు.