అప్పుడే పుట్టిన పాప తక్కువ బరువుతో జన్మించినందున చనిపోయిందని వైద్యులు నిర్ధరించారు. డాక్టర్లు డెత్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. దాంతో కన్నీటి పర్యంతమైన ఆ చిన్నారి కుటుంబీకులు అంత్యక్రియలు చేయడానికి సిద్ధ పడ్డారు.
శ్మశానికి వెళ్తుండగా.. ఆ శిశువు కళ్లు తెరిచింది. దీంతో అవాక్కైన తల్లిదండ్రులు వెంటనే ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. వరంగల్ అర్బన్ జిల్లాలో ఈ ఆశ్చర్యకర సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే..
వరంగల్ జిల్లాలోని పెగడపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్, స్వప్న దంపతులకు ఓ శిశువు జన్మించింది. చిన్నారి బలహీనంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. మూడు రోజులు చికిత్స తర్వాత పాప చనిపోయిందని డాక్టర్లు తెలిపారు.
కానీ ఆ పసికందు.. అప్పటికీ ప్రాణాలతోనే ఉంది. అయినా నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్లు.. చిన్నారి మృతి చెందినట్లు మరణ ధ్రువీకరణ పత్రం కూడా ఇచ్చారు. దీంతో పాపను అంత్యక్రియల కోసం శ్మశానానికి తీసుకెళ్తుండగా.. చిన్నారి కదలడం గమనించారు. పాప బతికే ఉండటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆ చిన్నారి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.