హనీ ట్రాప్..IAF అధికారి అరెస్ట్!

2
- Advertisement -

పాకిస్థాన్ నిఘా సంస్థ ఏజెంట్ పరిచిన ‘హనీ ట్రాప్’ వలలో చిక్కుకుని రహస్యాలను చేరవేసారనే ఆరోపణలతో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (IAF) వింగ్ కమాండర్‌ను ఆఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ (OSA) కింద మే నెలలో అరెస్ట్ చేశారు.సోషల్ మీడియాలో ఒక మహిళ పన్నిన హనీ ట్రాప్‌లో చిక్కుకుని పాకిస్థాన్ నిఘా ఏజెంట్‌కు సున్నితమైన రక్షణ సమాచారాన్ని మరియు వర్గీకరించబడిన (క్లాసిఫైడ్) పత్రాలను చేరవేసిన ఆరోపణలపై 44 ఏళ్ల సర్వింగ్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (IAF) వింగ్ కమాండర్‌ను మే నెలలో అరెస్టు చేసినట్లు శనివారం పోలీసులు తెలిపారు.

అయితే సదరు అధికారి పేరును వెల్లడించలేదు. మే 31న అతడిని అదుపులోకి తీసుకున్న దాదాపు 50 రోజుల తర్వాత పోలీసులు ఈ అరెస్టు వివరాలను బయటపెట్టారు.ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు బృందం జూలై 30న సంబంధిత న్యాయస్థానంలో ఛార్జ్‌షీట్‌ను సమర్పించినట్లు ఢిల్లీ పోలీసులు ప్రకటన విడుదల చేశారు.

భారత వైమానిక దళ అధికారుల ఫిర్యాదు ఆధారంగా, పాకిస్థానీ నిఘా ఏజెంట్ హనీ ట్రాప్‌కు గురయ్యారనే ఆరోపణలపై విధుల్లో ఉన్న ఎయిర్‌ఫోర్స్ అధికారిని మే 30న అరెస్టు చేశాం. విచారణ అనంతరం జూలై 30న సత్త్వర న్యాయస్థానంలో ఛార్జ్‌షీట్ సమర్పించాం. ఈ వ్యవహారం ప్రస్తుతం న్యాయస్థాన పరిధిలో ఉంది అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

స్పెషల్ సెల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన తర్వాత ఐఏఎఫ్ అధికారిపై ఆఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ (OSA)లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మే 31న ఆయనను అరెస్టు చేసిన అనంతరం స్పెషల్ సెల్, కేంద్ర నిఘా సంస్థలు సంయుక్తంగా విచారించాయి. ఆ తర్వాత ఆయన్ను నగర కోర్టులో ప్రవేశపెట్టగా జూన్ నెలలో జ్యూడీషియల్ కస్టడీకి పంపింది. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో ఉన్నారని అధికారులు తెలిపారు.

వ్యక్తిగత జీవితంలో సమస్యలను ఎదుర్కొంటున్న సదరు వింగ్ కమాండర్‌కు ఈ ఏడాది ప్రారంభంలో ఒక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో సదరు మహిళ పరిచయమైనట్లు ఒక అధికారి తెలిపారు. వారు మెసేజ్‌లు పంపుకోవడంతో పాటు, సెక్యూర్డ్ కమ్యూనికేషన్ యాప్ ద్వారా ఫోన్ సంభాషణలు కూడా జరిపారు.

“అతని నమ్మకాన్ని గెలుచుకున్న తర్వాత, ఆ మహిళ భారత రక్షణ వ్యవస్థకు సంబంధించిన రహస్య పత్రాలు మరియు సున్నితమైన వివరాలను ఫోటోలు, వీడియోల రూపంలో సేకరించింది. అంతేకాకుండా, అతని సహోద్యోగి మొబైల్ ఫోన్‌లో ఒక యాప్‌ను ఇన్‌స్టాల్ చేయమని కూడా కోరింది. ఫోన్ డేటాను దొంగిలించడానికి మరియు లోకేషన్‌ను ట్రాక్ చేయడానికి అది స్పైవేర్ లేదా రిమోట్ యాక్సెస్ మాల్‌వేర్‌గా పనిచేసి ఉండే అవకాశం ఉంది” అని సదరు అధికారి తెలిపారు.

Also Read:‘డిసి’తో బ్లాక్‌బస్టర్ హిట్!

ఐఏఎఫ్ నిఘా విభాగం ఎలక్ట్రానిక్ నిఘా ద్వారా ఈ అధికారి కార్యకలాపాల గురించి తెలుసుకుని, అతనిపై ఉన్న వివరాలు, ఆధారాలను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్‌తో పంచుకోవడంతో ఈ గూఢచర్యం వ్యవహారం వెలుగులోకి వచ్చిందని మరొక అధికారి వెల్లడించారు. చట్టపరమైన చర్యల నిమిత్తం ఆ అధికారిని స్పెషల్ సెల్‌కు అప్పగించారు. వింగ్ కమాండర్‌ను హనీ ట్రాప్ చేయడానికి ఉపయోగించిన సదరు మహిళ పాకిస్థాన్‌కు చెందిన హ్యాండ్లర్ల కోసం పనిచేస్తుండవచ్చని స్పెషల్ సెల్ దర్యాప్తు సూచిస్తోంది. భారత రక్షణ వ్యవస్థకు సంబంధించిన నిఘా సమాచారాన్ని సేకరించే ఒక పెద్ద గూఢచారి నెట్‌వర్క్‌లో ఆమె భాగమై ఉండవచ్చు అధికారులు తెలిపారు.

- Advertisement -