Holi:ఆనంద కేళి.. హోలీ

38
- Advertisement -

అంటూ రాగయుక్తంగా పాడుకుంటూ ఆడ పడుచులు ఊర్లో ఇంటింటికి తిరిగి హోళీ పండుగ మామూళ్ళు అడుక్కోవడం ఒకవైపు మగవాళ్ళు అల్లో మల్లో రాముల మల్లో అంటూ కోలాటాలు లయబద్ధంగా కొట్టుకుంటూ పాటలు పాడుకుంటూ, ఆడుకుంటూ ఎంతో ఉత్సాహంతో ఇంటింటికి తిరిగి హోళీ మామూళ్ళు వసూలు చేయడం నా చిన్నప్పుడు మా ఊర్లో అదే నల్గొండ పక్కన చర్లపల్లిలో చాలా సందడిగా ఉండేది.హోళీ పండుగ అనే వాళ్ళం కాదు రంగుల పండుగ అనే వాళ్ళం.పండుగకు ఒక వారం ముందు నుంచే ఆడ,మగ అందరూ జట్లు జట్లుగా మారి రంగల పండుగకు తయారీ అయ్యేవారు.అప్పట్లో ప్రతి పండుగను సాంప్రదాయ బద్దంగా, నిర్వహించేవారు.

ఒక్కొక్క పండుగకు ఒకో చరిత్ర ఉండేది.ఆ చరిత్రలన్నీ ఒకే నీతిని బోధించేవి.చెడు మీద మంచి విజయం, దుష్ట శక్తుల నుండి ఊరిని, ఊరి ప్రజలను కాపాడుతూ, ఎలాంటి కరువు కాటకాలు రాకుండా, చెడు ప్రభావం తొలగిపోయేలా ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని చెప్పే పద్ధతులే పండుగలు.ప్రతి పండుగకు ఒక తంతు ఉంటుంది.ఒకప్పుడు ఊర్లల్లో పండుగలు వస్తే ఊరు ఊరంతా ఒక్కటై ఒకే చోట చేరి సంతోషాలను పంచుకోవడం, ఒకరు చేసిన వంటకాలను మరొకరు
పంచుకోవడం,ఆ ఫలానా పండుగ రోజు అందరి ఇళ్ళల్లోకి వెళ్ళడం అలా వెళ్ళేటప్పుడు తమ ఇంట్లో చేసిన వంటకాలను తీసుకెళ్ళి ఇవ్వడం,మగవాళ్ళు కొత్త బట్టలు వేసుకొని ఆరుబయట నులక మంచాలపై కూర్చుని మాట్లాడుకునే వారు ఆడవాళ్ళు బయట చాపలు వేసుకొని వాటిపై కూర్చొని ముచ్చట్లు చెప్పుకునేవారు ఊర్లల్లో దాదాపుగా ప్రతి ఇంటి దర్వాజాకు ఇరువైపులా శాబాదు బండ అరుగులు ఉండేవి.ఆ అరుగులు మట్టితో చిన్న గోడలు..ఆ గోడలపై శాబాదు బండ.ఆ గోడలను
పేడతో అలికి వాటిపై అందంగా ఆకర్షణీయంగా ముగ్గులు చేసేవారు.అప్పట్లో పండుగ వస్తుందంటే నెల రోజుల ముందు నుంచే హడావుడి మొదలైయ్యేది.పెద్దలు పిల్లలు,కొత్త బట్టలు కుట్టించుకోవడం.. ఊర్లో ఆస్థాన మేరోల్లను కుట్టిన బట్టలు ఎప్పుడిస్తావనీ తొందర చేయడం అందరూ చేస్తుండేవారు.అప్పట్లో ఒక ఇద్దరు ఉత్పత్తి కులాల వారిని మాత్రం మనం మార్చేవాళ్ళం కాదు ఒకరు మంగలోల్లను, మరొకరు మేరోల్లను, ఎందుకంటే హేయిర్ కటింగ్,బట్టల కొలతలు ఇవి రెండూ చాలా ముఖ్యమైనవి.ఈ రెండూ చెడిపోతే చూడడానికి బాగుండేది కాదు,అందుకే ఈ ఇద్దరు తమ వృత్తి నైపుణ్యంతో మనుషులు అందంగా కనబడేలా చూస్తారు.అందుకే వాళ్ళకు ఎక్కువ డబ్బులు ఇచ్చినా తప్పు లేదు.ఊరోల్ల బట్టలన్నీ పండుగ వరకు పూర్తి చేయలేక మేరోల్లు నానా అవస్థ పడే వారు.

కొత్త బట్టల కోసం పిల్లలు వాళ్ళ ఇంటి ముందు పడిగాపులు కాసే వారు.కొందరి అదృష్టవంతుల బట్టలు ముందుగానే పూర్తి అయ్యేవి.కొందరివి మధ్యాహ్నం, మరికొందరివి సాయంత్రం వరకు కూడా పూర్తయ్యేవి కాదు.ఇలా సాయంత్రం వరకు కొత్త బట్టలు వస్తాయా రావా అన్న టెన్షన్ లో పిల్లలు ఉండేవారు…..కట్ చేస్తే..
రంగుల పండుగ వారం ముందు నుంచే ఆడ,మగ వాళ్ళు ఇంటింటికి తిరిగి హోళీ మామూళ్ళు అడుక్కునే వారు.అప్పట్లో ఒకటి, రెండు రూపాయలు డబ్బులో లేదంటే ఒక ఛాట నిండుగా బియ్యం ఇచ్చేవారు.రోజుకో ఒక జట్టు వస్తుండడంతో విసుగెత్తి కొందరిని పట్టించుకునే వాళ్ళు కాదు.కోలాటాల పాటలు,
ఆడవాళ్ళు చప్పట్లు కొట్టుకుంటూ పాడే పాటల సాహిత్యం ఇంటింటికి మారిపోతుండేది.ఆ ఇంటి యజమానిని పొగుడుతూ అప్పటి కప్పుడు లిరిక్స్ మనసులోనే రాసుకొని దానికి బాణీ కట్టి రమణీయంగా పాడేవారు.కోలాటాల పాటలు అంతే అవి కూడా ఎంతో హుషారుగా ఉండేవి.నృత్యం, కోలాటం కలిపి వాళ్ళు పాడే పాటలు చాలా అద్భుతంగా ఉండేవి.ఇంకొందరు వీళ్ళ దాటికి తట్టుకోలేక చివరిగా పండుగ రోజున వచ్చి మామూళ్ళు తీసుకొమ్మని చెప్పేవారు.తెల్లవారితే పండుగ అనంగా ముందు రోజు రాత్రి కాముడి దహనం కార్యక్రమం ఉండేది.ఈ కాముడి దహనం ఎందుకు చేస్తారన్న వివరాల్లోకి వెళ్ళకూడదని అనుకుంటున్నాను.ఎందుకంటే
ఆర్టికల్ లెంగ్త్ ఎక్కువ అవుతుంది.ఈ కాముడి దహనం నా చిన్నప్పుడు చాకలోళ్ళు,కుమ్మరోళ్ళు ముందుండి హరిజనులలో ఒక తెగ అయిన బేగరోళ్ళ సహాయంతో
మా ఊరి స్కూలు వెనక వైపు ఉన్న మూడు కూడలుల మధ్యలో జరిపేవారు.కామ దహనానికి కావలసిన కట్టెలు, నిప్పు పెట్టడానికి కావలసిన పిడికలు అన్నీ ఇప్పటి బేగరి కొండయ్య వాళ్ళ నాన్న అప్పట్లో సిద్దం చేసేవాడు.

కాముడి దహనానికి ముందు ఊరి మగవాళ్ళు కోలాటం ఆడుతూ నృత్యం చేస్తుంటే ఆడవాళ్ళు పాటలు పాడేవారు,కాముడికి నిప్పు పెట్టాక ఆ వెలుగులో మగ వాళ్ళు దాని చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ నృత్యం చేస్తూ చేసే సందడి వీనుల విందుగా ఉండేది.చివర్లో వాళ్ళ కట్టె కోలాటాలను మంటల్లో వేస్తారు.అప్పట్లో ఒక కథ ప్రచారంలో ఉండేది.ఏ ఇంట్లో అయినా పొయ్యి వెలగాలంటే నిప్పు అవసరం.ఆ నిప్పుని జకముక రాళ్ళతో ( పలుగు రాళ్ళు) పుట్టించేది.జమ్మిదూదిని జకముక రాళ్ళ మధ్య పెట్టి, ఒకదానితో ఒకటిని గట్టిగా కొట్టడంతో నిప్పు పుట్టేది,దానితో వంట చేసుకోవడం, పెద్దోళ్ళు చుట్ట కాల్చుకోవడం చేస్తుండేవారు. ముందు తరాల వాళ్ళు ఈ జకముక రాళ్ళతోనే నిప్పును పుట్టించి కాముడి దహనం చేసేవారని చరిత్ర.ఆ రోజు కాముడి దహనంలోని నిప్పుతో ఇంట్లో దీపం వెలిగిస్తే, ఆ నిప్పుతో పొయ్యి వెలిగిస్తే మంచిదని ఒక నమ్మకం.అంతేకాకుండా కాముడి దహనంలోని బూడిదను పంట పొలాలలో చల్లుకుంటే పంటకు పట్టే చీడ పురుగులు చచ్చిపోతాయన్న నమ్మకం ఉండేది.ఆ బూడిద వంటికి రాస్తే పిల్లలకు అమ్మవారు వ్యాది తగ్గిపోతుందని,చర్మ సంబంధ వ్యాధులకు ఈ బూడిద ఒక ఔషధంలా పనిచేస్తుందనీ, ఇంట్లో చల్లితే పాములు, తేళ్ళు ఇతర క్రిమి కీటకాలు ఇంట్లోకి రావని ప్రజల ప్రగాఢ విశ్వాసం…కట్ చేస్తే…. రాత్రి కాముడి దహనం తెల్లవారితే హోళీ పండుగ అదే రంగుల పండుగ.

తెల్లవారుజామునుంచి ప్రతి ఇంట్లో ఆడ, మగ వాళ్ళుచిన్న పిల్లలవుతారు.తమ పిల్లల వయసుకు తగ్గిపోతారు.మొగుడు, పెళ్ళాలు,బావలు,మరదళ్ళు, బావలు,బావ మరుదులు, వదినలు,మరదళ్ళు, స్నేహితులు అందరూ అత్యంత ఉత్సాహంతో రంగులు పూసుకుంటారు.నా చిన్నప్పుడు రంగులంటే కుంకుమ, నల్లటి ఒక ఆయిల్ ఉండేవి.ఆ ఆయిల్ ని ముఖానికి రాస్తే ముఖమంతా నల్లగా అయ్యేది.అది తొందరగా పోయేది కాదు.ఇప్పుడు కెమికల్ కలర్స్,ఉపయేగిస్తున్నారు.దీని వలన అనేక మంది చూపును కోల్పోతున్నారు.మధ్యాహ్నం పన్నెండు,ఒంటి గంట వరకు రంగుల పండుగ ఆడిన తర్వాత ఆడవాళ్ళు వంట పనుల్లోకి, మగవాళ్ళు తాటిచెట్ల కిందికి పోయేవారు.మా ఊర్లో మా కులస్తులు, కొప్పోలు వంశస్థుల పెద్ద కుటుంబం ఉండేది.వాళ్ళ కుటింబీకులే ఊరి కరణంగా వ్యవహరించేవారు.వాళ్ళ అన్నదమ్ముల ఇళ్ళు వరుసగా ఉండేవి.వీళ్ళ ఇంటి వెనుక రెండెకరాల్లో తోట ఉండేది.ఆ తోటలో చాలా తాటి చెట్లు.

అప్పట్లో ఆ ప్రాంత మంతా గౌండ్లోళ్ళు కల్లు అమ్మడం, దాన్ని తాగడానికి ఊరోళ్ళతో నిండి పోయేది.ఆ తోటను ఆనుకొని పెద్ద బావి ఉండేది.ఆ బావితో నా చిన్నప్పటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి.ఇంకోపక్క దస్తగిరి డంగు ఉండేది.డంగ్ అంటే సున్నం, ఇసుకను మిక్స్ చేసి డంగులో వేసి,ఎడ్లతో తిప్పించడం.ఇప్పుడు ఇండ్లు కట్టడానికి సిమెంట్, ఇసుక మిశ్రమాన్ని ఉపయేగిస్తున్నారు.కానీ అప్పట్లో సిమెంట్ కు బదులు సుద్దరాళ్ళను వేడి చేయగా వచ్చే సున్నం, ఇసుకను డంగ్ లో వేసి బాగా తిప్పితే వచ్చే మిశ్రమాన్ని ఇంటి కట్టడాలకు ఉపయేగించేవారు.మా చిన్నాయన ఆవంచ లక్ష్మారావు తన ఇంటిని సున్నం, ఇసుక మిశ్రమంతోనే నిర్మించారు. ఇల్లు,చలువదనమే కాకుండా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది.అలా మధ్యాహ్నం వరకు హోళీ ఆడి చాలా మంది ఆ తోటలో సేద తీరేవారు.సాయంత్రం
బావ మరుదులు బావలకు, మరదళ్ళు వదినలకు చిలకల పేర్ల దండలు వేసేవారు, బెల్లం,మురమురాలతో చేసిన ముద్దలతో నోటిని తీపి చేసేవారు.దానికి బావలు సంతోషపడి బావమరుదులకు దావత్ ఇవ్వడం చేస్తుండేవాళ్ళు.ఇది ఒక సాంప్రదాయం.

మా నాయన,చిన్నాయనలు గానీ మేము గానీ హోళీ పండుగ జరుపుకోలేదు.ఎందుకంటే ఆ రోజే మా తాతయ్య ఆవంచ రంగారావు చనిపోయారు.అందుకే ఆ ఒక్క పండుగను జరుపుకోవడం మానేసాం.మా నాన్న అప్పుడప్పుడు అంటుండేవారు మీరు పిల్లలు కదా హోళీ ఆడుకోండి అని, కానీ నాన్న ఆ రోజంతా చాలా ముభావంగా, సీరియస్ గా ఉండేవారు.తద్దినం తిథుల ప్రకారం హోళీ ముందో,తరవాతో వస్తుండేది.ముఖ్యంగా హోళీ పండుగ రోజు ఆయన చాలా బాధగా ఉండేవారు.దీంతో మాకు కూడా హోళీ ఆడేందుకు ఇష్టం ఉండేది కాదు.మా ఇంట్లో వరస పండుగల లిస్టులో హోళీ పండుగను డిలీట్ చేసాం.మా అమ్మ వాళ్ళది వరంగల్ జిల్లా కూనూరు గ్రామం.అక్కడ వాళ్ళ చిన్నప్పుడు హోళీ పండుగను చాలా ఘనంగా జరుపుకునేవారమనీ అమ్మ చెప్పేది.వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు హోళీ పండుగ రోజు సాయంత్రం మగపిల్లలకు తెల్ల చొక్కాలు,ఆడ పిల్లలకు తెల్లగౌన్లు, వేసి వాళ్ళ మెడలో చిలకల పేర్ల దండలు వేయడం ఆనవాయితీ అనీ మాకు చెప్పింది.మా అమ్మమ్మ ఎప్పుడైనా హోళీ పండుగకు మా చర్లపల్లికి వస్తే నాకు ,మా చిన్నక్కయ్యకు పండుగ సాయంత్రం ఎర్రమళ్ళ వెంకయ్య కిరాణా దుకాణంలో నుంచి చిలకల పేర్ల దండ తెప్పించి వేసేది.అలా సాయంత్రం ఊర్లో పిల్లలు చిలకల పేర్ల దండలు మెడలో వేసుకొని గంతులేసేవారు.బావలు ఇచ్చే దావత్ తో బావమరుదులు సంతోషంగా గడిపేవారు.ఊరు ఊరంతా పొద్దుగూకగానే సర్దుమణిగేది….. పున్నమి వెన్నెల పుడమిని ఏలేది…

ప్రమోద్ ఆవంచ
7013272452

- Advertisement -