అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు ఉత్కంఠగా కొనసాగుతోంది. డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి పోటీపడుతున్న హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ మధ్య తొలిసారిగా న్యూయార్క్‌లోని ఓఫ్‌స్ట్రా యూనివర్సిటీలో బిగ్ డిబేట్ జరిగింది. కాలేజీ క్యాంపస్‌లు.. బార్లు.. సీనియర్ సెంటర్లు ఎక్కడ చూసినా అమెరికన్లు టీవీలకు అతుక్కుపోయారు. మధ్య మధ్యలో పెద్దగా నవ్వడం, హర్షధ్వానాలు, జోక్స్ వేసుకోవడం ఎక్కడ చూసినా దాదాపు ఇవే దృశ్యాలు కనిపించాయి. అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న హిల్లరీ క్లింటన్, డోనాల్డ్ ట్రంప్‌ల మధ్య అమెరికా కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 90 నిమిషాలపాటు జరిగిన బిగ్‌డిబేట్ ఇరువురు పార్టీ విధి విధానాలు ప్రకటిస్తూ ప్రత్యర్థిపై పైచేయి సాధించే ప్రయత్నం చేశారు.
హోరా హోరీగా సాగిన ముఖాముఖి చర్చలో అమెరికా అభివృద్ధి, ప్రజల భద్రత, శ్రేయస్సు వంటి అంశాలతో పాటు వ్యక్తిగత విమర్శలకు దిగారు. నేను డిబేట్ కోసం సిద్దం కాలేదు.. అధ్యక్ష పదవికి సిద్ధమయ్యానని ట్రంప్ వ్యాఖ్యానించగా… నేను అధ్యక్షపదవికి సిద్ధమయ్యా అందుకే నేను డిబేట్‌కు సిద్ధమయ్యానని హిల్లరీ బదులిచ్చారు.
ఈ బిగ్ డిబేట్ లో ట్రంప్ కు ఎదురుదెబ్బ తగిలింది. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ విజయం సాధించింది. ఆమెకు 62శాతం మద్దతు లభించగా.. డోనాల్డ్ ట్రంప్ కు 27శాతం మద్దతుమాత్రమే దక్కింది. నవంబర్ లో జరగనున్న ఎన్నికలకు ముందు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ చర్చ జరుగుతుండగా సీఎఎన్ఎన్-ఓఆర్సీ సంస్థ ఈ పోల్ నిర్వహించింది. ఈ ఫేస్ టు ఫేస్ కార్యక్రమాన్ని దాదాపు 100 మిలియన్ల మంది వీక్షించారని సర్వే పేర్కొంది. ఈ సమయంలోనే సీఎన్ఎన్-ఓఆర్సీ టీవీ వీక్షకుల నుంచి అభిప్రాయంకోరగా 62శాతం మంది క్లింటన్ కు మద్దతివ్వగా 27శాతం మంది ట్రంప్ కు మద్దతిచ్చారు.
తప్పును అంగీకరించిన హిల్లరీ…
బిగ్ డిబెట్‌లో పాల్గొన్న హిల్లరీ ఈమెయిల్ వివాదం విషయంలో తప్పును అంగీకరిస్తున్నానని తెలిపింది.అది పెద్ద తప్పు కాకపోయినా.. పూర్తి బాధ్యత నాదేనని స్పష్టం చేశారు. ఉద్యోగాల తరలి పోతున్నాయంటూ ట్రంప్ చేసిన విమర్శలకు హిల్లరీ ధీటుగా స్పందించారు. ట్రంప్ రాజకీయ జీవితం జాత్యాహంకారంతోనే మొదలైందని ఘాటుగా స్పందించిన హిల్లరీ ఉద్యోగాల కల్పనకు చాలా మార్గాలున్నాయని తెలిపింది.
సంపన్నులకు పన్నుల తగ్గింపు ఇవ్వమని… కార్పొరేట్ లొసుగుల వల్ల ఎక్కువగా లాభపడింది ట్రంప్ కుటుంబమేనన్నారు. ట్రంప్ ఆర్థిక వ్యవహారాలన్నీ దాచి పెడుతున్నారు. కనీసం ఫెడరల్ ఇన్‌కం ట్యాక్స్ కూడా కట్టలేదని హిల్లరీ ఆరోపించారు. అమెరికా చట్టాలను ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందేనని, అలాగే అమెరికాలో ఉన్న ప్రతి ఒక్కరినీ గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు.ఐసిస్‌ను సమర్థంగా ఎదుర్కొంటామని…అందరికీ ఆయుధాలు ఉండటం ప్రమాదకరమే, తీవ్ర వాద భావజాలం ఉన్న వారికి సులభంగా తుపాకులు దొరుకుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
హిల్లరీకి ప్రణాళిక లేదన్న ట్రంప్…
ప్రస్తుతం అమెరికా చాలా సమస్యలు ఎదర్కొంటోందన్న ట్రంప్…. ఆర్థిక విలువలు తెలిసిన వారే సమర్థంగా నడపగలరని వ్యాఖ్యానించారు. నా ట్యాక్స్ వివరాలు బయటపెడతా… హిల్లరీ తన సీక్రెట్ మెయిల్స్ బయట పెట్టగలరా అని ప్రశ్నించారు. పన్నులు తగ్గిస్తానని.. హిల్లరీకి ఎలాంటి ప్రణాళికా లేదని తెలిపారు. ఉద్యోగాలు తరలిపోతున్నాయి.. చైనా, మెక్సికో, ఇండియా వంటి దేశాలు ఉద్యోగాలు కొల్లగొడుతున్నాయని ట్రంప్ ఆరోపించారు. నేను ఉద్యోగాలు వెనక్కు తీసుకురాగలను.. హిల్లరీ వల్ల కాదని ట్రంప్ తెలిపారు.