ట్రాపిక్ హోంగార్డును అభినందించారు హైకోర్టు సీజే సతీశ్ చంద్ర శర్మ. తన విధులను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తున్న ఓ ట్రాఫిక్ హోంగార్డ్‌ను ప్రశంసించారు. ఈ ఘటన అబిడ్స్‌లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద శుక్రవారం ఉదయం ఆవిష్కృతమైంది.
చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ ప్రతి రోజు తన అధికారిక నివాసం నుంచి హైకోర్టుకు అబిడ్స్ మీదుగా వెళ్తుంటారు. ఆ సమయంలో అబిడ్స్‌లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద ట్రాఫిక్ హోంగార్డ్ అష్రఫ్ అలీ(5066, అబిడ్స్ పీఎస్) విధులు నిర్వర్తిస్తుంటాడు. అష్రఫ్ తన విధులను చిత్తశుద్ధితో నిర్వహించడాన్ని చీఫ్ జస్టిస్ ప్రతి రోజు గమనించేవారు. ఈ క్రమంలో అతని పనితీరు పట్ల ఆకర్షితులైన సీజే సతీశ్ చంద్ర శర్మ.. శుక్రవారం ఉదయం తన కాన్వాయ్‌ను బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద ఆపారు. హోంగార్డ్ అష్రఫ్ అలీకి పుష్పగుచ్ఛం అందించి, అభినందించారు.

