ముందస్తు అప్‌డేట్స్‌…ఓటర్ల ముసాయిదా జాబితా రిలీజ్

216
Dana Kishore
- Advertisement -

తెలంగాణలో ముందస్తు ఎన్నికల ప్రక్రియ జోరందుకుంది. షెడ్యూల్ కన్నా ముందుగానే ఎన్నికలు జరిపించేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. రేపు జాతీయ ఎన్నికల కమిషన్ బృందం రాష్ట్రానికి రానుంది. ఇక ఇవాళ ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేయనున్నారు జిల్లా ఎన్నికల అధికారి,జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్.

ఇవాళ ముసాయిదాను విడుదల చేసి 25వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు తెలిపారు. వచ్చే నెల 8న తుది ఓటర్ల జాబితాను విడదుల చేయనున్న్టట్లు చెప్పారు. బీఎల్‌వోలుగా నియమితులైన అంగన్‌వాడీ కార్యకర్తలు, ఇతర శాఖల సిబ్బంది విధిగా హాజరు కావాలని, ఎన్నికల విధులకు గైర్హాజరయితే చట్టప్రకారం చర్యలుంటాయని హెచ్చరించారు.

ప్రతి నియోజకవర్గంలో కనీసం వెయ్యి ఇండ్లను సంబంధిత ఈవోలు, ఎల్‌ఈఆర్వోలు స్వయంగా సందర్శించి ఓటర్ల జాబితాను తనిఖీ చేయాలని కమిషనర్ స్పష్టం చేశారు. జిల్లాలోని ప్రతి పోలింగ్ కేంద్రంలో కనీస మౌలిక సదుపాయాలు.. మంచినీరు, టాయిలెట్లు, ఫర్నిచర్, హెల్ప్‌డెస్క్, సైన్‌బోర్డులు ఉండేలా ఇప్పటి నుంచే తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ నెల 11, 12వ తేదీల్లో రాష్ట్రంలో పర్యటించే కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధి బృందం నగరంలోని పోలింగ్ కేంద్రాలను, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను తనిఖీ చేసే అవసరం ఉందని చెప్పారు.

ఇదిలావుండగా, ఇప్పటికే 105 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించి దూకుడు మీదున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, నేడో, రేపో మరో జాబితాను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ సైతం పొత్తులు ఖరారయ్యాక తొలిజాబితాను విడుదల చేయనున్నట్టు సమాచారం.

- Advertisement -