మరోసారి హైడ్రాపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. సున్నం చెరువు కూల్చివేతల అంశంలో కోర్టు ఇచ్చిన గత ఉత్తర్వులను పూర్తిగా పట్టించుకోకుండా అధికారులు వ్యవహరించారని హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను హైడ్రా ఉల్లంఘించిందని కోర్టు మండిపడింది. చెరువు పరిధి, రక్షిత ప్రాంతాలపై స్పష్టమైన వివరాలు లేకుండానే కూల్చివేతలు చేపట్టడం బాధ్యతారాహిత్యమని వ్యాఖ్యానించింది.
కోర్టు స్పష్టంగా నిలువరించినప్పటికీ అక్కడ ఫెన్సింగ్ ఎందుకు ఏర్పాటు చేశారో అధికారులు సమాధానం చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిన వారు, అవే ఆదేశాలను ఉల్లంఘించడం ఎలాంటి పరిపాలన విధానమని ప్రశ్నించింది. గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకోకుండా ముందుకు ఎలా సాగారో వివరించాలని కోరింది.
FTL (ఫుల్ ట్యాంక్ లెవెల్) నిర్ధారణ లేకుండా చెరువు పరిధిని ఎవరి ఆధారంగా గుర్తించారని హైకోర్టు ప్రశ్నించింది. సరైన సర్వే, నిబంధనల ప్రకారం జరగాల్సిన ప్రక్రియలను విస్మరిస్తే ఎలా ప్రజల ఆస్తులను కూల్చివేయగలమని కోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. ప్రజల హక్కులను కాపాడటం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని హైకోర్టు గుర్తుచేసింది.
హైడ్రా చర్యలు నిర్వాహక లోపమే కాక, కోర్టు ఆదేశాలకు అవమానమని పేర్కొంటూ, బాధ్యులపై ఎలా చర్యలు తీసుకుంటారో నివేదిక అందించాలని హైకోర్టు స్పష్టం చేసింది.
Also Read:Karnataka:డీకే..ట్వీట్ వైరల్

