దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో వైరస్‌కు మందు కనిపెట్టాడానికి చాలా ఫార్మా సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే గ్లెన్ మార్క్ ఫార్మా సంస్థ ఫాబిఫ్లూ పేరుతో ఫావిపిరావిర్ టాబ్లెట్లను మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గ్లెన్ మార్క్ కు అనుమతులు కూడా మంజూరు చేసింది. ఇదిలావుంటే తాజా హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ జెనెరిక్ ఫార్మాస్యూటికల్ కంపెనీ హెటిరో కరోనాను కట్టడి చేసే ఔషధాన్ని ఆవిష్కరించింది. కోవిడ్-19 చికిత్సకు యాంటీ వైరల్ మెడిసిన్ రెమిడిసివిర్
ఉత్పత్తి, మార్కెటింగ్ కోసం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నుంచి అనుమతి పొందినట్లు కంపెనీ వెల్లడించింది.
రెమిడిసివిర్ జెనెరిక్ వెర్షన్‌ను భారత్‌లో కోవిఫర్
పేరుతో విడుదల చేసేందుకు సిద్ధమైంది. కోవిడ్-19 చికిత్సలో యాంటీ వైరల్ డ్రగ్ రెమిడిసివిర్ ప్రభావవంతంగా పనిచేస్తుందని వైద్యులు గుర్తించారు. ఆక్సిజన్ సపోర్ట్ అవసరమైన కేసుల్లోనే తక్కువ డోస్‌లో రెమిడిసివిర్ వాడేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది ఇంజక్షన్ రూపంలో ‘కోవిఫర్ 100 ఎంజీ’ మార్కెట్లోకి రానుందని హెటిరో ఛైర్మన్ డాక్టర్ బి. పార్థసారథి రెడ్డి తెలిపారు. 100 ఎంఎల్ పరిమాణంలో ఉన్న ఒక్కో ఇంజెక్షన్ ధర రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు ఉంటుందని భావిస్తున్నారు.