తమిళ్ హీరో విశాలో వచ్చే ఏడు ఓ ఇంటి వాడు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన విశాల్ వచ్చేఏడు జనవరి లో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించాడు. అయితే ఇంతకీ విశాల్ పెళ్లి చేసుకునేది ఆ అమ్మాయేనా అని సినీ జనాలు గుసగుసలాడుతున్నారు. తమిళ నడిగర్ సంఘం ఎన్నికల్లో హీరో విశాల్ ప్రత్యేర్దిని మట్టికరిపించి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల ప్రచారంలో నటుల సంఘం భవనాన్ని నిర్మిస్తామని హామీఇచ్చాడు. ఈ మేరకు విశాల్ చెన్నై విమానాశ్రయంలో మాట్లాడుతూ, నడిగర్ సంఘం నూతన భవన నిర్మాణం వేగంగా జరుగుతోందని అన్నాడు.
డిసెంబర్ నాటికి ఈ భవన నిర్మాణం పూర్తవుతుందని, జనవరిలో ప్రారంభోత్సవం ఉంటుందని ప్రకటించాడు. పనిలో పనిగా ఆ భవనంలోని కల్యాణ మండపంలో జరిగే తొలి పెళ్లి తనదేనని తెలిపాడు. ఈ మేరకు అడ్వాన్స్ ఇచ్చి మండపాన్ని బుక్ చేసుకున్నానని తెలిపాడు. అయితే వధువు ఎవరు? అన్నది మాత్రం సీక్రెట్ గా ఉంచాడు. కాగా, శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మితో విశాల్ ప్రేమలో ఉన్నాడంటూ గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఇక చలన చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న క్యూబ్, జీఎస్టీ వంటి సమస్యలపై సంఘటితంగా పోరాడాలని ఇచ్చిన పిలుపుకు కట్టుబడి ఉన్నామని విశాల్ తెలిపాడు. ఈ మేరకు మార్చి 1 నుంచి సమ్మె జరుగుతుందని స్పష్టం చేశాడు. ఆరోజు నుంచి సినిమాల విడుదల ఉండదని అన్నాడు. క్యూబ్ సంస్థలతో ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని, అవి సఫలమవుతాయని ఆశిస్తున్నట్టు విశాల్ తెలిపాడు. ఇక అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో తమిళభాష ప్రత్యేక విభాగం ఏర్పాటుకు నిధులందించాలన్న ఆలోచనలో ఉన్నామని విశాల్ తెలిపాడు.