అంతా మన చేతుల్లో ఉండదనేది జీవిత సత్యం. ఎన్ని కోట్ల డబ్బున్నా ఎంత ఆస్తి ఉన్నా దేవుడిని విధిని శాశించలేం. కొన్ని సంఘటనలు చూస్తే ఇది నిజమనిపిస్తుంది. విశాల్ హీరోగా మార్క్ ఆంటోనీ అనే సినిమా రూపొందుతోంది. ఇందులో మన కమెడియన్ సునీల్ మెయిన్ విలన్స్ లో ఒకరిగా నటిస్తున్నాడు. ఎస్ జె సూర్య వీళ్లిద్దరితో సమాన ప్రాధాన్యం ఉన్న మరో కీలక పాత్రధారి. దీని షూటింగ్ సందర్భంగా ఒక యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేస్తుండగా పెద్ద మిలిటరీ లారీ ఒకటి లిప్తపాటు కాలంలో బ్రేకులు అదుపు తప్పడంతో ఏకంగా ఆర్టిస్టుల మీదకు దూసుకొచ్చింది.
ఆ ఫైట్ లో నేల మీద ఎస్ జె సూర్య, ఆ లారీకి ఎదురుగా విశాల్ నిలుచున్న సీన్ అది. అయితే ప్రమాదాన్ని చివరి క్షణంలో గుర్తుపట్టిన ఇద్దరు వెంటనే పక్కకు తప్పుకోవడంతో పెద్ద గండం తప్పింది. దాని తాలూకు వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. విశాల్ సూర్యలు ఇద్దరూ వేర్వేరుగా చేసిన ట్వీట్లలో దీని గురించి ప్రస్తావించి అదృష్టం బాగుండి నాలుగు నూకలు ఇంకా మిగిలున్నాయి కాబట్టే ప్రాణాలతో ఉన్నామని చెప్పుకొచ్చారు. ఆ మధ్య లాఠీ షూటింగ్ టైంలోనూ విశాల్ గాయానికి గురైతే అది పబ్లిసిటీ స్టంటని ట్రోల్ చేసిన నెటిజెన్లు ఉన్నారు.
ఇలాంటివి పరిశ్రమలో జరుగుతూ ఉంటాయి. నలభై ఏళ్ళ క్రితం కూలీ టైంలో అమితాబ్ బచ్చన్ దాదాపు మృత్యు ముఖం చూశారు. అభిమానుల ప్రార్ధనలు ఫలించి బ్రతికారు. ఆ మధ్య మాస్తి గుడి అనే కన్నడ చిత్రం చిత్రీకరణలో ఇద్దరు ఫైట్ మాస్టర్లు హెలికాఫ్టర్ నుంచి కిందపడి చనిపోవడం ఇంకా గుర్తే. మొత్తానికి మార్క్ ఆంటోనీ అనుభవం సూర్య విశాల్ లకు జీవితాంతం గుర్తుండిపోతుంది. ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ గ్యాంగ్ స్టర్ పీరియాడిక్ డ్రామాని వచ్చే వేసవిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఫ్లాపులుతో సతమతమవుతున్న విశాల్ కి ఇదైనా బ్రేక్ ఇస్తుందో లేదో చూడాలి.
ఇవి కూడా చదవండి..