బాలీవుడ్ డ్రీమ్‌గర్ల్, మధుర ఎంపీ హేమామాలినిపై మహారాష్ట్రలోని ఓ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేశారు. రైతుల ఆత్మహత్యలను ప్రస్తావించిన ఎమ్మెల్యే బచ్చు కాడు.. హేమామాలిని రోజూ తాగుతారంటూ వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువవుతున్న నేపథ్యంలో నాందేడ్ జిల్లాలోని స్వతంత్య్ర ఎమ్మెల్యే బాచు కడు స్పందించారు.
మద్యపానం అలవాటు వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెబుతున్నారు. అది పూర్తిగా అవాస్తవమని తెలిపారు. 75శాతం ఎమ్మెల్యేలు, జర్నలిస్టులు తాగుతారు. అంతెందుకు హేమామాలిని కూడా రోజూ తాగుతారు. అలా అని ఆమె ఆత్మహత్య చేసుకుందా?’ అంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై పెద్ద దుమారం రేగింది.
పెళ్లిళ్లకు అధికంగా ఖర్చు చేయడం కూడా రైతు ఆత్మహత్యలకు కారణం కాదని ఆయన స్పష్టంచేశారు. దీనికీ ఓ కేంద్రమంత్రిని ఉదహరించడం గమనార్హం. నితిన్ గడ్కరీ నాలుగు కోట్లు ఖర్చు పెట్టి కొడుకు పెళ్లి చేశారు. ఆయన ఆత్మహత్య చేసుకుంటారా? అంటూ బచ్చు కాడు ప్రశ్నించారు. మహారాష్ట్రలో కరువు కారణంగా రోజూ ఎక్కడో ఓ చోట రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. ఈ ఆత్మహత్యలకు నిజమైన కారణం డబ్బు లేకపోవడమే అని కాడు చెప్పారు. ఎమ్మెస్ స్వామినాథన్ చెప్పినట్లు.. రైతుల ఉత్పత్తి పెరుగుతున్నా వారి ఆదాయం మాత్రం పెరగడం లేదు అని ఆయన అన్నారు.
అచల్‌పూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన బాచు కడు వివాదాల్లో చిక్కుకోవడం ఇదే తొలిసారి కాదు. గతేడాది మహారాష్ట్ర సచివాలయంలో ఓ ప్రభుత్వాధికారిపై చేయి చేసుకోని వార్తల్లోకెక్కారు . ఆ సమయంలో ఆయన్ని అరెస్టు కూడా చేశారు.