సినీ నటి హేమ మీడియా తీరుపై సంధర్బం దొరికిన ప్రతిసారి ఎదో ఒకటి చెప్పేయడం.. సలహాలు ఇస్తుందన్న సంగతి తెలిసిందే. ఎవరైనా ఏదైనా వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు అందుకు సంబంధించిన పూర్తి వాస్తవాలు తెలుసుకోకుండా వార్తలు ప్రసారం చేయవద్దని.. నిజ నిర్ధారణ చేసుకోకుండా పదేపదే ఆ వార్తలు ప్రసారం చేయడం వల్ల వారి జీవితాలు నాశనమవుతున్నాయని హేమ పలుసార్లు ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా మరోసారి చలపతి రావు సంచలన కామెంట్లను కూడా ఇదే విధంగా రెస్పాన్స్ ఇచ్చింది. చలపతి రావు ఆడవాళ్లపై చేసిన కామెంట్లను ఇప్పటికే సినీ లోకమంతా ఖండిస్తున్నది.
ఈ వ్యాఖ్యలపై స్పందించిన హేమ ఆచితూచి మాట్లాడారు. ఈ వ్యవహారంపై ఏమన్నారో ఆమె మాటల్లోనే…‘‘చలపతి బాబాయ్ ఒక ఆడియో ఫంక్షన్‌లో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని ఆడవాళ్లంతా, నా కో ఆర్టిస్ట్ ఝాన్సీ పోలీస్ స్టేషన్‌కెళ్లి ఫిర్యాదు చేయడం జరిగింది. నిజంగా చలపతి బాబాయ్ చేసింది తప్పు. నేను మీ అందరితో ఏకీభవిస్తున్నాను. ఫిర్యాదు చేసి మంచి పనిచేశారు. ఇక నుంచి ఎవరైనా ఒక మహిళ గురించి తప్పుగా ఒక పదం పలకాలన్నా వంద సార్లు ఆలోచిస్తాడు. సో, మీరు చేసిన మంచి పనికి మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే, చలపతి బాబాయ్ ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు. సరదాగా మాట్లాడతాడు కానీ ఎప్పుడూ ఆడవాళ్లకేం హాని చేయలేదు.
అలాంటి ఒక పెద్ద వ్యక్తి సంస్కారంతో చానల్స్‌కు వెళ్లి ‘‘మాట జారిన మాట వాస్తవం. ఆడవాళ్లందరినీ నేను క్షమాపణ అడుగుతున్నాను’’ అని సంస్కారవంతంగా క్షమాపణలు అడిగారు. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని దయచేసి ఈ కేసులు, ఇవన్నీ విత్ డ్రా చేసుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాగే మనందరం ఐకమత్యతతో ఉంటే, మన మీద సోషల్ మీడియాలో ఏదైనా ఒక తప్పు పదం రాయడానికి కూడా భయపడాలి. ఇక నుంచి మా వాళ్లే కాదు, ఎవరైనా మన అమ్మ గురించి రాసేటప్పుడు ఇలానే రాస్తామా అని ఆలోచించండి. వెబ్ మీడియా ఇకనైనా మారుతుందని ఆశిస్తున్నాను. అలాగే ఎవ్వరూ కూడా ఆడవాళ్ల గురించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి.. గతంలో చాలా జరిగాయి. ఇకనైనా మారండి.. వాస్తవాలు తెలుసుకోకుండా వార్తలు ప్రసారం చేయవద్దని, అటువంటి వార్తలు ఆపాలని మీడియాను కోరింది హేమ. హేమ చేసిన వ్యాఖ్యలు చూస్తే.. ఆయన మాటల్ని తప్పు పడుతూనే.. ఆయన్ను వదిలేయాలన్న విషయాన్ని సూటిగానే చెప్పేయటం కనిపిస్తోంది.