మిస్టర్ చిత్రం అంతగా ఆశాజనకంగా లేకపోయినా హెబ్బా వరుస సినిమాలు చేస్తోంది. టాలీవుడ్‌లో యువ హీరోయిన్లలో హెబ్బా పటేల్‌కు సక్సెస్ రేట్ ఎక్కువగానే ఉంది. అయితే ప్రస్తుతం ఆమె నటించిన అంధగాడు సినిమా జూన్ 2వ (శుక్రవారం) విడుదలకు సిద్ధమవుతున్నది.
హీరో రాజ్ తరుణ్‌తో హెబ్బాకు ఇది వరుసగా మూడో చిత్రం. అంధగాడు రిలీజ్ నేపథ్యంలో హెబ్బాపటేల్ మీడియా మాట్లాడుతూ.. సినిమా, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
”అంధగాడు సినిమా చూశాను. ఆ సినిమా గురించి నేను చెప్పడం కంటే మీరు చూసి చెప్పడం చాలా సమంజసంగా ఉంటుంది. ఇక సినిమా విషయానికి వస్తే రచయిత, దర్శకుడు వెలిగొండ శ్రీనివాస్ చెప్పిన కథ నాకు బాగా నచ్చడం వల్ల ఈ సినిమా చేయాలని నిర్ణయించుకొన్నాను. ఈ సినిమాలో నా పాత్ర పేరు నేత్ర. నేను కంటి వైద్యురాలిగా పనిచేస్తున్నాను. ఈ సినిమాలో రాజ్ తరుణ్ అంధుడు. ఆయనకు కంటిచూపు తిరిగి తెప్పించడానికి వైద్యం చేస్తాను. రాజ్ తరుణ్‌తో రిలేషన్ వల్ల నా కుటుంబంలో చోటుచేసుకొన్న సమస్యలు ఏమిటనది ఈ సినిమాలో కథ. ఆ సినిమా చూసి ఎలా ఉందోననే విషయం మీరే చెప్పాలి” అని చెప్పుకొచ్చింది.
ఇక ఇందులో తన క్యారెక్టర్ చిలిపి అమ్మాయి పాత్ర అని, డాక్టర్ కావడం వల్ల పాత్రలో మెచ్చురిటీ కనిపిస్తుందని చెప్పింది. వెలిగొండ శ్రీనివాస్ చాలా అనుభవం ఉన్న రచయిత. సెట్లో అతడిని చూస్తే కొత్త డైరెక్టర్ అనే ఫీలింగ్ కలుగలేదు. చాలా అనుభవం ఉన్న దర్శకుడిగా కనిపించాడంటూ..డైరెక్టర్ కి కాంప్లిమెంట్ కూడా ఇచ్చింది.
ఇక రాజ్ తరుణ్ గురించి మాట్లాడుతూ.. ”మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు చూస్తే వ్యక్తిగతంగా రాజ్ తరుణ్ చాలా మారిపోయాడు. చాలా సౌమ్యుడిగా కనిపిస్తాడు. చాలా కామ్ అయ్యాడు. మొదట్లో చాలా హైపర్. ఇప్పుడు అవేమీ లేదు. యాక్టింగ్ పరంగా మొదటి నుంచి బాగా నటిస్తాడని చెప్పుకొచ్చింది హెబ్బ. అయితే ఈ అమ్మడుకి రాజ్ తరుణ్‌తో కాకుండా ఇతర హీరోలతో నటించాలని ఉందట. కానీ.. పర్టిక్యులర్‌గా ఫలానా హీరోతోనే అని కాకుండా.. పాత్ర, అవకాశాన్ని బట్టి హీరోతో నటిస్తానంటూ తెలిపింది.
ఇదిలా ఉంటే..రాజ్ తరుణ్‌తో తనకు అఫైర్ ఉందని వచ్చే గాసిప్స్‌ను పట్టించుకోనని, అందులో నిజం లేదు కాబట్టి, అలాంటివాటికి ఎందుకు బాధపడాలంటూ సమాధానమిచ్చింది. ఇక తనపై గాసిప్స్ వస్తున్నాయంటే తనకు పాపులారిటీ ఉందని తాను అనుకొంటున్నట్టు చెప్పేసింది. ”2015 నుంచి ఇప్పటివరకు వరుసగా సినిమాలు చేస్తున్నాను. రెండు నెలలు గ్యాప్ తీసుకోవాలని అనుకొంటున్నాను. నాకు విశ్రాంతి అవసరం అని భావిస్తున్నాను.
ఇప్పట్లో పెళ్లి చేసుకొనే ఉద్దేశం లేదు. ఇక కెరీర్ ముగిసిందని, అవకాశాలు రావడం లేదు అని అనిపించినప్పుడు నేను పెళ్లి చేసుకొంటాను. సినిమా విడుదలకు ముందు అందరికీ ఉన్నట్టే నాకు విపరీతమైన టెన్షన్ ఉంటుంది. నా సినిమాల గురించి నేను చక్కగా విశ్లేషించుకుంటాను. నా స్నేహితులు నాకు మంచి క్రిటిక్స్. నాకు మంచి స్నేహితులు ఉన్నారు.” అని తన మనసులో మాటలని చెప్పుకొచ్చింది హెబ్బ పటేల్.