ప్రచండ భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోవడంతో నిప్పుల కొలిమిని తలపిస్తోంది. పగటిపూట ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటుతున్నాయి. ఎండకు తోడు వడగాలులు వీస్తుండటంతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు.
మద్యాహ్నం వేళ అయితే రోడ్డు మీదకు రావడమంటే ప్రాణాలతో చెలగాటమే. భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇటు బస్సు ప్రయాణాలంటేనే జనం హడలిపోతున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ 46 డిగ్రీల టెంపరేచర్ నమోదయైంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వడగాడ్పులు బెంబేలెత్తిస్తున్నాయి.
కరీంనగర్ జిల్లాలో అయితే ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఏడు గంటలవకు ఎండ తీవ్రత కనిపిస్తోంది. మరో మూడు రోజులు ఇదే పరిస్థితి ఉండనుండడంతో ఎవరూ ఇళ్లలోంచి బయటకు రావడంవ లేదు.
ఇక ఉత్తరాంధ్రలో అయితే తుఫాన్ వెళ్లిపోయిన తర్వాత గాలిలో తేమ శాతం తగ్గిపోయింది. దీనివల్ల ఒక్కసారిగా వేడి ప్రభావం పెరిగింది. ఉదయం ఏడు నుంచే ఎండ సుర్రుమంటోంది. విశాఖ వంటి చోట్ల నలభై డిగ్రీలు దాటిపోతోంది. వడగాడ్పులు హడలెత్తిస్తున్నాయి. ఏపీలో విశాఖతో పాటు, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, కడప, అనంతపురం, కర్నూలులో ఎండలకు చుక్కలు కనిపిస్తున్నాయి.