శ్రీశైలంకు పోటెత్తిన భక్తులు….

332
srisailam
- Advertisement -

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలి వస్తుండటంతో శ్రీశైల పురవీధులన్నీ భక్తులతో కిటకిటలాడాయి కొన్ని రోజులుగా కృష్ణానదిలో ఉధృతమైన వరద పరవళ్లు తొక్కుతూ శ్రీశైల జలాశయానికి చేరుకుని మల్లన్న చెంతను దాటుకుని సాగర్ వైపుకు నురుగులు కక్కుతూ పరిగెడుతోంది. శ్రీశైలం డ్యామ్లో ప్రవహించే కృష్ణమ్మ సోయగాలను చూసేందుకు తెలంగాణ రాష్ట్ర జిల్లాల నుండి వచ్చే యాత్రికులతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులతో నల్లమల రహదారులన్నీ రాకపోకలతో స్తంభించిపోయాయి. ముప్పైకిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు సుమారు ఐదు గంటల సమయం పడుతుందంటే ఆశ్చర్య అయిపోతుంది.

కరొనా కట్టడిలో ఇంటి నుంచి బయటకు రాని ప్రకృతి ప్రేమికులంతా ఒక్కసారిగా నల్లమల అటవీ ప్రాంతాల నుండి శ్రీశైలం వైపుకు రావడంతో జన సందోహంతో సందడిగా మారింది. శ్రీశైలం వైపుకు వస్తున్న యాత్రికులంతా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దర్శనం చేసుకుని కృష్ణమ్మకు సారెలు సమర్పిస్తూ పాతాళ గంగ వద్ద సందడిగా చేశారు.

శ్రీశైలంలో పెరిగిన రద్దీ కారణంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలని అధికారులను ఆదేశించినట్లు ఆలయ ఈవో కేఎస్ రామారావు తెలిపారు.

క్యూలైన్లలో భౌతిక దూరం పాటిస్తూ స్వామి అమ్మవార్ల అలంకార దర్శనాలు చేసుకుని ముడుపులు చెల్లించుకుంటున్నారు . భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆలయ నిబంధనలు పాటిస్తూ దేవస్థానం సిబ్బందితో ప్రతి భక్తుడు సహకరించవలసిందిగా ఈవో కె ఎస్ రామారావు కోరారు. దర్శనానంతరం లడ్డూ ప్రసాద విక్రయశాల వద్ద క్యూలైన్లో వేచి ఉండి మహాప్రసాదాన్ని అందుకుని తిరుగు ప్రయాణం అవుతున్నారు.

- Advertisement -