రాష్ట్రంలో పలుచోట్ల అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో రెండు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనంతో తీవ్రమైన వాయుగుండం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు వరద నీరు వచ్చి చేరుతోంది. ఏ ప్రాజెక్టు చూసినా నిండకుండలా కనిపిస్తోంది.
నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులుకాగా.. ప్రస్తుతం 698.5 అడుగులకు చేరింది. దీంతో 13గేట్లు ఎత్తివేసి.. 1.25లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలోను కురుస్తున్న జోరు వానలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. భారీ వర్షాలతో పలు చోట్ల వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. అటు కొత్తగూడెం భద్రాచలం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో ఎటువంటి విపత్కర పరిస్థితులు చోటుచేసుకోకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం .