రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శనివారం ఓ మోస్తరు వర్షం పడింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురవగా, వరంగల్ రూరల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో పలు వాగులు పొంగిపొర్లాయి. జలాశయాలు కొత్తశోభను సంతరించుకున్నాయి. వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుండటంతో రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు మరింత బలపడనున్నా యి.
దీంతో రాబోయే మరో మూడు రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని,పలు చోట్ల మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రేపటి నుంచి పలు చోట్ల అతి భారీ వర్షాలు కురవనున్నాయని పేర్కొంది.
మరోవైపు కోస్తాంధ్ర, రాయలసీమల్లో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. 7.6 కి.మీ. ఎత్తు వరకు వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ఎత్తుకు వెళ్లే కొద్దీ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. రెండు మూడు రోజుల్లో అల్పపీడనం ఏర్పడనుండటంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.