తెలంగాణ వ్యాప్తంగా రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు,వంకలు పొంగిపొర్లుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు అంతరాయం ఏర్పడింది. అన్నారం బ్యారేజీ వద్ద కరక్కట్ట పనులు నిలిచిపోయాయి.
శ్రీరాంపూర్ ఉపరితల గనిలో మట్టిపనులు నిలిచిపోయాయి. వర్షాల కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు అంతరాయం ఏర్పడింది. కన్నెపల్లి పంప్ హౌస్,గ్రావిటీ కెనాల్,మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కాంక్రిట్ పనులు నిలిచిపోయాయి. మందమర్రిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.
ఖమ్మం జిల్లాలో పలుచోట్ల 24 గంటల నుంచి వర్షం కురుస్తూనే ఉంది. నల్లకుంట వాగు పొంగిపొర్లుతుండటంతో నర్సింహులగూడెం – పోచారం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ముదిగొండ మండలం చిరిమరిలో చెరువు ,మణుగూరు మండలంలో కోడిపుంజుల వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ర నేలకొండపల్లి మండలం ఆరెగూడెంలో చెరువుకట్ట తెగిపోవడంతో పంటపొలాలు మునిగిపోయాయి.
ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకూ 1766.08 మిమీ వర్షపాతం నమోదైంది. జిల్లాలోని నేలకొండపల్లి మండలంలో 253.8 మిమీ, ముదిగొండ మండలం 226.4 మిమీ, ఖమ్మం అర్బన్ మండలంలో 128.2మిమీ, బోనకల్లు మండలంలో 109.4మిమీ,సత్తుపల్లి 76.8మిమీ వర్షం పడింది.