హైదరాబాద్ నగరంలో సోమవారం సాయంత్రం వాతావరణంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. కారు మబ్బులు కమ్ముకోవడంతో సాయంత్రం 5.30 గంటలకే ఒక్కసారి చీకటి అలముకుంది. మరోవైపు నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. బేగంపేట, బోయిన్‌పల్లి, ప్యాట్నీ, మారేడ్‌పల్లి, అడ్డగుట్ట, తుకారాం గేట్, చిలకలగూడ, మోండా మార్కెట్, పార్శీ గుట్ట, తిరుమలగిరి, వారాసిగూడ, చంపాపేట, సరూర్‌నగర్ పాతబస్తీలోని చార్మినార్, యాకుత్‌పురా, బహదూర్‌పురా, సైదాబాద్, గాంధీనగర్, కోఠి, బేగంబజార్, అబిడ్స్, గోషామహల్, అమీర్‌పేట, ఎస్‌ఆర్‌నగర్, ఎర్రగడ్డ, సనత్‌నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. చాంద్రాయణ గుట్ట ఫ్లైఓవర్ కింద వర్షపు నీరు భారీగా చేరడంతో దాదాపు 2కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. ఓ ఆర్టీసీ బస్సు వర్షపు నీటిలోనే నిలిచిపోయింది.
సాయంత్రం 6 గంటల వరకు నగరంలో అత్యధిక వర్షపాతం నమోదైన పది ప్రాంతాల్లోని వర్షపాతం వివరాలు..
రాజేంద్రనగర్ 8.4 సెంటీమీటర్లు, అంబర్‌పేట 7, అసిఫ్‌నగర్ 6.9, గోల్కొండ 6.9, బహదూర్‌పుర 6.8, చార్మినార్ 6, హిమాయత్‌నగర్ 6, అమీర్‌పేట 5.5, ముషీరాబాద్ 5.5, శేరిలింగంపల్లిలో 5 సెంటీమీటర్ల లెక్కన వర్షపాతం నమోదైంది. మిగిలిన ప్రాంతాల్లో కూడా మూడు సెంటీమీటర్లకు తక్కువ కాకుండా వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.