గత అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు మహానగరం నీట మునిగింది. ఉదయం వరకు పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురవడంతో రోడ్లు, పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. దీంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట, కూకట్ పల్లి, చందానగర్, మియాపూర్, నిజాంపేట, సికింద్రాబాద్, కవాడిగూడ, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, ఉప్పల్, రామాంతపూర్, సైనిక్ పురి, మల్కాజ్ గిరి, అబిడ్స్, కోఠి, దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. గత రాత్రి నుంచి నగరంలో 7.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
మియాపూర్ ప్రాంతంలోని దీప్తిశ్రీనగర్ రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరింది. పలు బస్తీల్లో వరద నీరు ఇండ్లలోకి చేరింది. ఈస్ట్ ఆనంద్ బాగ్, వెంకటేశ్వర నగర్ భారీ వర్షాలకు జలమయమయ్యాయి. మల్కాజ్ గిరిలో బండ చెరువు పొంగి పొర్లుతున్నది. చెరువు కట్ట తెగడంతో లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరుతున్నది. పలు కాలనీలకు కరెంట్ సరఫరా నిలిచిపోయింది. రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ మాన్ సూన్ టీమ్.. రోడ్లపైన నిలిచిన వాన నీటిని తొలగిస్తున్నది.
మరోవైపు జంటనగరాల్లో వర్షాల పరిస్థితిని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి సమీక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో అగ్ని మాపక, రెవెన్యూ శాఖల సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీ సిబ్బందిని ఆయన ఆదేశించారు.