హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం..

36
rains

ఏడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ తడిసి ముద్దైంది. వర్షాలు అంటేనే భయపడేలా చినుకులు పడటంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రాత్రి 8 గంటలకు మొదలైన వర్షం…అర్థరాత్రి దాటేవరకు కురుస్తూనే ఉండటంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోయింది.

నాగోల్‌ పరిధిలోని బండ్లగూడలో అత్యధికంగా 21.2 సెంటీమీటర్లు, వనస్థలిపురంలో 19.2 సెంటీమీటర్లు, హస్తినాపురంలో 19, భవానీనగర్‌లో 17.9, హయత్‌నగర్‌లో 17.1 సెంటీమీటర్లు, రామంతాపూర్‌లో 17.1 సెంటీమీటర్లు, హబ్సిగూడలో 16.5, నాగోల్‌లో 15.6,ఎల్బీనగర్‌లో 14.9, లింగోజిగూడలో 14.6, ఉప్పల్‌ మారుతినగర్‌లో 13.4 సెంటీమీటర్ల వర్షం నమోదైంది.

ఉప్పల్ అశోక్ నగర్‌లోని పలు కాలనీలు నీట మునగగా ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజల అవస్థలు వర్ణనాతీతం. అంబర్‌పేట మూసీ పరివాహం ప్రాంతాల్లో డ్రైనేజీలు ఉప్పొంగాయి. పటేల్‌నగర్‌, ప్రేమ్‌నగర్‌లోని ఇళ్లలోకి మురుగునీరు చేరింది. నాగోల్‌ పరిధిలోని అయ్యప్ప నగర్‌ కాలనీ నీట మునిగింది. మల్లికార్జున నగర్‌, త్యాగరాజనగర్‌ కాలనీల్లోకి, సరూర్‌నగర్‌ చెరువుకట్ల లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. ఛత్తీస్‌గఢ్‌పై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య గాలులతో ద్రోణి ఏర్పడింది. గురువారం కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.