రాష్ట్రంలో ఆగస్టు 9 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఈ నెల 8న 9 జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫా బాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
కొన్ని జిల్లాలలో కుండపోత వర్షాలు, మరికొన్ని జిల్లాలలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. రాగల 24 గంటలలో నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్లా, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, సూర్యపేట, ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.