పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా మరో మూడు రోజులపాటు ఏపీ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర తీరానికి సమీపంలో ఇది ఆవరించి ఉండడంతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మరో 72 గంటలపాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమ, కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొన్ని చోట్ల మాత్రం భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో శనివారం (సెప్టెంబర్ 21) వర్షం కురిసింది. ఆది, సోమ వారాల్లోనూ అనేక చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.