రాష్ట్రంలో రాగల మూడురోజులు భారీ వర్షాలు..

128
rains

ఉత్తర అండమాన్ సముద్రం మరియు దాని పరిసర ప్రాంతాలలో ఈరోజు(అక్టోబరు 9 వ తేదీ) ఉదయం 05.30 గంటలకు అల్పపీడనం ఏర్పడింది. ఇది ఈరోజు ఉదయం 08.30 గంటలకు ఉత్తర అండమాన్ సముద్రం మరియు దానిని ఆనుకొని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉన్నది. దీనికి అనుబంధముగా మధ్యస్థ ట్రోపొస్పీయర్ స్థాయిల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రాగల 24 గంటలలో ఇది మధ్య బంగాళాఖాతంలో వాయుగుండముగా మారే అవకాశం ఉంది. తదుపరి ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరంలో అక్టోబరు 12వ తేదీ ఉదయం వాయుగుండముగా తీరాన్ని దాటే అవకాశం ఉంది.

దీంతో ఏపీలో రాయలసీమ మరియు దానిని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రాంతాలలో 1.5 km ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రాయలసీమ ప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుండి దక్షిణ తమిళనాడు 0.9 km ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీంతో ఏపీలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఈరోజు చాలా చోట్ల మరియు రేపు అనేకచోట్ల కురిసే అవకాశం ఉంది.

ఇక మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్, సిద్దిపేట, జనగామ, వరంగల్(పట్టణ మరియు గ్రామీణ) జయశంకర్ భూపాలపల్లి, ములుగు,యాదాద్రి భువనగిరి,మెహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట మరియు నల్గొండ జిల్లాలలో ఈరోజు, రేపు ఒకటి రెండుచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఎల్లుండి అక్కడక్కడ ఉరుములు,మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఒకటి రెండుచోట్ల భారీ నుండి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.