భాగ్యనగరంలో శుక్రవారం రాత్రి 8గంటల నుంచి ఏకధాటిగా 3గంటల పాటు భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి హైదరాబాద్ తడిసి ముద్దవ్వగా, పలు ప్రాంతాల్లో రహదారులు జలమయం అయ్యాయి. అత్యధికంగా మాదాపూర్, బాలానగర్‌లో 12 సెంటీమీటర్లు,బండ్లగూడ, బేగంపేట, మైత్రీవనం, రామచంద్రాపురంలో 10, శ్రీనగర్ కాలనీ, అంబర్‌పేట్, కుత్బుల్లాపూర్‌లో 9 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.
రాత్రి కురిసిన వర్షం వల్ల 30 ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వెంటనే రంగంలోకి దిగిన విద్యుత్ సిబ్బంది మరమ్మతులు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 18 చోట్ల చెట్లు నేలకూలాయి. 42 చోట్ల అధికంగా నిలిచిన నీటిని సిబ్బంది తొలగించారు. జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్‌కు రాత్రి 129 ఫిర్యాదులు అందాయి. 100, మై జీహెచ్ఎంసీ యాప్‌కు వచ్చిన ఫిర్యాదులపై అధికార యంత్రాంగం స్పందించింది.
క్షేత్రస్థాయిలో 120 అత్యవసర బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, డిప్యూటీ, జోనల్ కమిషనర్లు వరద ప్రాంతాల్లో పర్యటించి పరిస్థతిని సమీక్షిస్తున్నారు. ప్రధానంగా ఎర్రమంజిల్ కూడలి, లక్డీకాపూల్ తదితర ప్రాంతాల్లో రహదారులపై పెద్ద ఎత్తున నీరు నిలిచిపోయింది. వినాయక చవితి కావడంతో పెద్ద సంఖ్యలో ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకోడానికి వచ్చిన భక్తులు తడిసి ముద్దయ్యారు.