రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఇవాళ రాష్ట్రంలోని పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. దక్షిణ జార్ఖండ్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం మధ్యప్రదేశ్ మధ్యభాగం పరిసరాల్లో కొనసాగుతున్నదని వాతవరణ కేంద్రం తెలిపింది. దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతూ నైరుతి వైపునకు వంపు తిరిగి ఉందని తెలిపారు.
ఇక ఇవాళ జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు అధికారులు. అలాగే ఆదిలాబాద్, కుమ్రంభీ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
రేపు ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. రాష్ట్రంలో 9వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.