ఈ వేసవి..మండే ఎండలే!

6
- Advertisement -

దేశవ్యాప్తంగా ఈ ఏడాది వేసవిలో ఎండల తీవ్రత అధికంగా ఉండనున్నట్లు ఐఎండీ ప్రకటించింది. తెలంగాణలో కూడా సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తాజా వెదర్ అవుట్‌లుక్‌లో వెల్లడించింది. ముఖ్యంగా మార్చి నుంచి మే వరకు ఎండ తీవ్రత పెరిగే అవకాశముంది. పగలు మాత్రమే కాకుండా రాత్రి వేళల్లో కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉండొచ్చని హెచ్చరించింది.

మార్చి నెలలో కొన్నిచోట్ల వర్షపాతం నమోదైనా, వేడి గాలుల ప్రభావం తగ్గే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని అధికారులు తెలిపారు. ఏప్రిల్, మే నెలల్లో వడగాలులు ఎక్కువ రోజులు వీచే అవకాశముంది. హైదరాబాద్, మహబూబ్‌నగర్, నల్గొండ ప్రాంతాల ప్రజలు ప్రత్యేకంగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తాగునీటి సరఫరా, ఆరోగ్య సేవలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని ఐఎండీ సూచించింది.

వేసవిలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగే నేపథ్యంలో ప్రభుత్వం కూడా పొదుపు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీలను 25 డిగ్రీల వద్దే నడపాలని ఆదేశాలు జారీ చేసింది. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లభిస్తున్నప్పటికీ, దాన్ని మించితే మొత్తం బిల్లు చెల్లించాల్సి ఉంటుంది.

విద్యుత్ ఆదా కోసం కొన్ని చిట్కాలు పాటించడం అవసరం. టీవీ, ఫ్యాన్లు అవసరం లేనప్పుడు పూర్తిగా ఆఫ్ చేయాలి. ఫోన్ ఛార్జింగ్ పూర్తయిన వెంటనే ప్లగ్ తీసేయాలి. 5 స్టార్ రేటింగ్ ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలు వాడితే విద్యుత్ పొదుపు అవుతుంది. ఏసీలను 25–28 డిగ్రీల మధ్య ఉంచి, టైమర్ ఉపయోగించడం మంచిది. వేసవికి ముందు ఏసీ ఫిల్టర్లు శుభ్రం చేయించుకోవడం కూడా విద్యుత్ ఆదాలో సహాయపడుతుంది. చిన్నచిన్న మార్పులు పెద్ద లాభాలను అందిస్తాయి.

Also Read:బుర్జ్ ఖలీఫా భవనానికి మంటలు

- Advertisement -