మ్యూజికాలజిస్ట్ హాసంరాజా పాటల, వాటి రాగాలపై రాసిన `ఆపాత మధురం` పుస్తకావిష్కరణ కార్యక్రమం ఇటీవల సికింద్రాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో డా.కె.ఐ.వరప్రసాద్ రెడ్డి, ఎ.వి.గురవారెడ్డి, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి, జె.మధుసూదన్ శర్మ, డా.సి.మృణాళిని, కె.రఘురామకృష్ణంరాజు, ఆర్.పి.పట్నాయక్, చంద్రబోస్, డా.భార్గవిరావు, సినీ గీత శిరోమణి హాసం రాజా, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. `ఆపాత మధురం` పుస్తకాన్ని పద్మభూషన్ అవార్డ్ గ్రహీత డా.కె.ఐ.వరప్రసాద్ రెడ్డి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా..డా.కె.ఐ.వరప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ – “రాజా ప్రతి పాటలోని సాహిత్యాన్ని విశ్లేషించి రాస్తే ప్రతి పాటలను వినాలనే ఆసక్తిని అందరిలో రేకెతిస్తుంది. ఆపాత మధురం పాటలకు సంబంధించి ఫుల్ మీల్స్ వంటిది. ఇలాంటి పుస్తకాలు ఇంకెన్నో అవసరం. మరిన్ని సంపుటిలు వస్తుందని భావిస్తున్నాను“ అన్నారు.
డా.సి.మృణాళిని మాట్లాడుతూ – “పాటలకు సంబంధించిన పరిశోధన, తర్కం, నైతికత, కచ్చితత్వం, పాఠకుడిని తనలో మిళితం చేసే గుణం ఈ పుస్తకంలో ఉంది. 1951-55 వరకు 21 చిత్రాల్లోని 108 గీతాలకు సంబంధించిన వాఖ్యాలున్నాయి. చిన్న ట్యూనుకు సంబంధించి ఆయనెంతో పరిశోధన చేశారు. ఆపాత మధురంలో ప్రస్తావించిన పాటల్లో ఓ రాగంలో పాట ఉందో స్పష్టంగా, బ్యాలెన్స్‌డ్‌గా రాసుకుంటూ వచ్చారు. సంగీతంతో పాటు సాహిత్యం గురించి కూడా సమతూకంగా విశ్లేషించారు. రాజాని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను“ అన్నారు.
డా.గురవారెడ్డి మాట్లాడుతూ – “రాజాతో హాసం ప్రతిక పనిచేస్తున్నప్పటి నుండి మంచి పరిచయం ఉంది. విమర్శను నొప్పించేలా కాకుండా ఒక సద్విమర్శగా, అందరికీ నచ్చేలా చెప్పడంలో రాజా సిద్ధహస్తులు. పాటపై ఆయనకు ఉన్న పట్టుతో ఎన్నెన్నో సూచనలు చేస్తుంటారు. ఆ సూచనలు ఎంతో మందికి మార్గదర్శకాలవుతుంటాయి. అలాంటి ఓ ప్రయత్నమే ఆపాత మధురం అనే పుస్తకం. ఇలాంటి పుస్తకాలు మరెన్నో రావాలని కోరుకుంటూ రచయిత హాసం రాజాని అభినందిస్తున్నాను` అన్నారు.
డా.కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ – “నాకు ఇష్టమైన జర్నలిస్టు హాసం రాజా. మితభాషి, అత్మాభిమానం గల వ్యక్తి, చదువుకున్న వ్యక్తి. తొలి కాపీని నాకు ఇచ్చింనందుకు థాంక్స్“ అన్నారు.
ఆర్.పి.పట్నాయక్ మాట్లాడుతూ – “విశ్లేషించి మాట్లాడేటంతటి వాడిని కాను. రాజాలాగా రవిరాజు కూడా చాలా పరిశోధనలు చేస్తుంటారు. రాజాతో మంచి పరిచయం ఉంది. నాకొక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది. ఇప్పటి వరకు చేసినవన్నీ ఒక ఎత్తు అయితే, నా ప్రాజెక్ట్ ఒక ఎత్తు. సంగీతం పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు సంగీతం ఎలా రూపాంతరం చెందింది. దానికి కారణమైనవారు ఎవరూ అనే దానికి సంబంధించి ఒక సీరియల్ చేయాలని కోరిక. అందుకు రాజా వెనుక పడుతున్నాను. తెలుగు సినిమా పాట కళ కళలాడాలంటే రాజా వంటి రీసెర్చ్ చేసే వ్యక్తి ఉండాల్సిన అవసరం ఉంది. రాజా పాటలపై ఎంతో రీసెర్చ్ చేశారు. ఆయన మన గుండెల్లో ఉండిపోతారు. ప్రతి పాట కోసం ఆయన చేసిన రీసెర్చ్‌లో ఎంతో నిజాయితీతో కూడిన కష్టముంది. రాజాని సామర్షి అని పిలవవచ్చునని నేను భావిస్తున్నాను. తెలుగు పాటను ప్రేక్షకులకు మరింత చేరువ చేస్తున్నందుకు రాజాకి అభినందనలు“ అన్నారు.
చంద్రబోస్ మాట్లాడుతూ – “నాకు, రాజాకి మంచి అనుబంధం ఉంది. రాజా పరిశోధకుడు, విమర్శకుడుగానే కాదు, మంచి పాటలకు సృష్టికర్తగా కూడా వ్యవహరిస్తున్నారు. నేను పాటల రాసే సమయంలో అభినందించారు. చరుకలు చేశారు. పద ప్రయోగాలు, భాష గురించి అనుమానాలుంటే రాజాకి ఫోన్ చేసి సందేహలు అడిగితే చెప్పేవారు. రాజా నాకు భావ, రాగ, లయాత్మక ఆత్మ బంధువు. ఆ పాత మధురం అనే పుస్తకం రాసినందుకు ఆయనకు థాంక్స్. భవిష్యత్‌లో మరిన్ని పుస్తకాలు రాయాలని కోరుకుంటున్నాను“ అన్నారు.
హాసం రాజా మాట్లాడుతూ – “గోవిందరావు, నారాయణరెడ్డి, ఎస్.పి.బాలసుబ్రమణ్యం, వరప్రసాద్ రెడ్డి అనే నలుగురు వ్యక్తుల ప్రోత్సాహంతో నేను ఇంత దూరం ప్రయాణం సాగించాను. అలాగే రవికిషోర్, భారవి ఇలా చాలా మంది మిత్రులు తమ సపోర్ట్‌ను అందించారు. అందరి సహకారం ఉంటే ఇలాంటి ప్రయత్నాలు ఎన్నింటినో చేసి చరిత్రలో నాకంటూ ఒక పేజీని క్రియేట్ చేసుకుంటాను“ అన్నారు.