ప్రజల సమస్యలు, ఆరు గ్యారెంటీల అమలుపై బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంటే, డైవర్షన్ రాజకీయాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెరలేపుతున్నారు అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన హరీష్..కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కుట్రపూరితంగా అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసింది…22A నిషేధిత భూముల జాబితా వ్యవహారంలో బీఆర్ఎస్ చేసిన ఆరోపణలు నిజమని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ఒప్పుకున్నారు.భూభారతి స్కామ్‌పై, 22A నిషేధిత భూములపై, గత మూడేళ్లలో జరిగిన అవకతవకలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి అన్నారు.
అసెంబ్లీలో ప్రతిపక్షంగా ప్రజల సమస్యలపై, ఆరు గ్యారెంటీల అమలుపై ప్రశ్నిస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి గారు బురద రాజకీయాలు చేస్తూ ఎదురుదాడికి దిగుతున్నారు.ఎంతకాలం బీఆర్ఎస్ మీద ఏడుస్తారు? ఎన్నిసార్లు అబద్ధాలు చెప్తూ కాలం గడుపుతారు? సమస్యలపై సమాధానం చెప్పే ధైర్యం లేక డైవర్షన్ డ్రామాలకు రేవంత్ రెడ్డి దిగుతున్నాడు.రేవంత్ రెడ్డి మాట్లాడినవన్నీ అర్ధసత్యాలు, అబద్ధాలు. రాహుల్ గాంధీ లోక్ సభకు టీ షర్ట్, స్టిక్కర్లు వేసుకుని వెళితే ఒప్పు..బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టీ షర్ట్ వేసుకుని వస్తే తప్పా? లోక్ సభ నియమాలు, అసెంబ్లీ నియమాలు వేరా చెప్పాలన్నారు.
అవ్వా తాతలకు రూ.4000 ఎగ్గొట్టారు, మహిళలకు రూ.2500 ఇవ్వలేదు, విద్యార్థులకు భరోసా కార్డు ఇవ్వలేదు. ఈ వైఫల్యాలను టీ షర్ట్ మీద రాసుకొస్తే బూతు పదాలని చెప్పి మమ్మల్ని సస్పెండ్ చేశారు.మేము కావాలని అసెంబ్లీ నుంచి బయటకు రాలేదు, పక్కా పథకం ప్రకారం మమ్మల్ని గెంటేశారు. మా మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి గారి గొంతు పిసికి, సునీతా లక్ష్మారెడ్డి గారి చీర లాగితే.. కనీసం మైక్ ఇవ్వాలని అడిగినందుకు సస్పెండ్ చేశారు.మేము సభలో ఉంటే మీ కుంభకోణాలు, మీ కుటుంబ అవినీతి బయటపడుతుందనే భయంతోనే మొత్తం సెషన్ కి మమ్మల్ని సస్పెండ్ చేశారు.సస్పెన్షన్ ఎత్తివేస్తే ఆధారాలతో సభకు వస్తామని మా ఎమ్మెల్యేలు సవాల్ చేశారు. కమ్యూనిస్ట్, బీజేపీ పార్టీలు కూడా అడిగాయి. అయినా సస్పెన్షన్ ఎత్తేసే దమ్ము ముఖ్యమంత్రికి లేదు.100 రోజుల్లో గ్యారెంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్లు ఇచ్చారు. రైతులు కరెంటు రాక ఆందోళనలు చేస్తున్నారు, ఫీజు రీయింబర్స్మెంట్ రాక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలపై మేము ప్రశ్నిస్తామనే భయంతోనే ఎదురుదాడి చేస్తున్నారు.22A నిషేధిత భూముల విషయంలో బీఆర్ఎస్ చేసిన ఆరోపణలు అక్షర సత్యమని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఒప్పుకున్నారు.3 లక్షల 71 వేల ఎకరాలు నిషేధిత జాబితాలో పెడితే, అది 30 లక్షల ఎకరాలకు పెరిగిందని ముఖ్యమంత్రే చెప్పారు. దీనివల్ల ఎన్ని లక్షల కుటుంబాలు ఇబ్బందులు పడ్డాయో సమాధానం చెప్పాలి అన్నారు.
కలెక్టర్లు దబా దబా సంతకాలు పెట్టి అప్లోడ్ చేశారని సీఎం అంటున్నారు. మరి తప్పు చేసిన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు..కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఒక్క ఎకరా కూడా నిషేధిత జాబితాలో పెట్టలేదని మంత్రి పొంగులేటి అంటారు. మరి అధికారులే 30 లక్షల ఎకరాలు అప్లోడ్ చేశారని ముఖ్యమంత్రి చెబుతున్నారు. ఇందులో ఎవరిది నిజం..1999 నాటి పాత జాబితాను కలెక్టర్లు అప్లోడ్ చేశారని, ప్రభుత్వం అమ్మిన HMDA, ULC భూములను కూడా నిషేధిత జాబితాలో పెట్టడం వల్ల ఉద్రిక్త పరిస్థితి ఏర్పడిందని ముఖ్యమంత్రే స్వయంగా ఒప్పుకున్నారు.దీనికి కారణం మీరే కదా, ప్రజలకు క్షమాపణలు చెప్పి సమస్యను ఎప్పుడు పరిష్కరిస్తారో చెప్పాలి.ముఖ్యమంత్రి ఇల్లు రాత్రికి రాత్రి నిషేధిత జాబితా నుంచి ఎలా తొలగించారో, అదే విధంగా ప్రజల ఆస్తులను కూడా 22A నుంచి తొలగించాలని నేను డిమాండ్ చేస్తున్నాను.చట్టం సామాన్యుడికైనా, ముఖ్యమంత్రికైనా ఒకటే ఉండాలి. నీ భూమి పెట్టింది, తీసింది బయటపెట్టానని నాపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారు.
నిషేధిత జాబితాలో ఉన్న భూములను తొలగించడానికి కమిటీలు వేస్తాం, గైడ్ లైన్స్ ఇస్తాం అని చెప్తున్నారు తప్ప, స్పష్టమైన పరిష్కారం చూపలేదు. ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసేందుకే ఈ నాటకాలు.తెలంగాణ ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారిపై అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ప్రాణాలకు తెగించి తెలంగాణ తెచ్చిన నాయకుడిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు.2023 డిసెంబర్ 7 నుంచి ఇప్పటి వరకు ఎన్ని భూములు నిషేధిత జాబితాలో పెట్టారు, ఎన్ని తొలగించారు అనేదానిపై శ్వేతపత్రం విడుదల చేయాలి.22A వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి.త్బుల్లాపూర్, మేడ్చల్, మల్కాజిగిరి తదితర ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి తెలంగాణ భవన్ లో తమ సమస్యలు చెప్పుకుంటున్నారు అన్నారు.
టీఆర్ఎస్ సమయంలో జరిగిన రిజిస్ట్రేషన్లు ఇప్పుడు ఆగిపోయాయని వాపోతున్నారు…ముఖ్యమంత్రి, మంత్రులు నాతో కలిసి వస్తే ప్రజల మధ్య నిలబడి మాట్లాడుదాం. ఈ సమస్య ఎవరు తెచ్చారో అడుగుదాం. కాంగ్రెస్ వచ్చాకే రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయని నిరూపిస్తా.టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి దోషులెవరో తేల్చలేదు. లక్షలాది మంది ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు.అవినీతిపై ప్రశ్నిస్తే కేసీఆర్ గారిపై, మాపై వ్యక్తిగత దాడులు చేస్తున్నారు. మా ఆస్తులన్నీ ఎలక్షన్ అఫిడవిట్ లో స్పష్టంగా డిక్లేర్ చేశాము. మీరు చెబుతున్నవి కొత్తవి కావు.మీ భూభారతిలో జనగామలో జరిగిన ఛాలెంజ్ క్యాంప్ స్కామ్ ను మేము బయటపెట్టాము. దీనివల్ల ప్రభుత్వానికి కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. దీనిపై తీసుకున్న చర్యలేంటి? ఏ అధికారిపై చర్యలు తీసుకున్నారు.భూభారతిలో 9200 కు పైగా భూముల రిజిస్ట్రేషన్లు యజమానులకు తెలియకుండానే జరిగిపోయాయి.గజ్వేల్ లో క్యాన్సర్ చికిత్స పొందుతున్న మహిళ భూమి ఆమెకు తెలియకుండానే బదిలీ అయింది.
ఇంత పెద్ద స్కామ్ పై ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడరు?..ధరణి ద్వారా కొన్ని లక్షల ట్రాన్సాక్షన్లు నిమిషాల్లో జరిగాయి. చిన్న చిన్న పొరపాట్లు ఉంటే సరిదిద్దాల్సింది పోయి, భూభారతి పేరుతో కుంభకోణాలకు పాల్పడుతున్నారు.నాదర్ గుల్ లో 10 వేల కోట్ల రూపాయల భూకుంభకోణాన్ని సాక్ష్యాధారాలతో బయటపెడితే ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పలేదు.ముఖ్యమంత్రి సోదరుడికి సంబంధించిన టెస్క్ కంపెనీకి కోట్ల విలువైన భూమి కేటాయింపు, పసుమాములలో మరో సోదరుడి భూమి నాలా కన్వర్షన్ పై ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ హయాంలో 11 లక్షల 19 వేల మంది రైతులకు ఉచితంగా సాదా బైనామాలు చేశాము. 58, 59 జీవోల ద్వారా లక్షల కుటుంబాలకు పట్టాలు ఇచ్చాము.మీరు జీవో 76 ద్వారా సింగరేణి కార్మికులకు ఇస్తున్న పట్టాలను, 118 జీవో కింద ఎల్బీ నగర్ లో ఇస్తున్న రిజిస్ట్రేషన్లను ఆపేశారు.హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని భూములను ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ లో కుదవపెట్టి వేల కోట్లు అప్పులు తెచ్చిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం.22A సమస్యపై ముఖ్యమంత్రి నుంచి స్పష్టమైన పరిష్కారం వస్తుందని ఆశిస్తే, కేవలం కమిటీలు వేస్తామని చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు.కేసీఆర్ గారిపై అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారు. ఆయనకు 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉందని మొన్నటిదాకా చెప్పి, ఇప్పుడు 67 ఎకరాలు అంటున్నారు. ఆయన జీవితం అంతా ప్రజల కోసమే అంకితం.ధరణి లేదా భూభారతిపై బీఆర్ఎస్, కాంగ్రెస్ హయాంలో జరిగిన వ్యవహారాలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు మేము సిద్ధం. మీరు సిద్ధమా.
రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల పేరుతో 308 ఎకరాల భూములు ఉన్నట్లు డాక్యుమెంట్లతో సహా ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. దీనికి సమాధానం చెప్పాలి.నాకున్న వ్యవసాయ భూమి వివరాలు ఎలక్షన్ అఫిడవిట్ లో, ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ లో స్పష్టంగా ఉన్నాయి. ఒక్క గుంట కూడా అదనంగా లేదు. నా భూమిని సర్వే చేసిన అధికారులే రెండు గుంటలు తక్కువ ఉందని తేల్చారు.మా బంధువులు చట్టబద్ధంగా కంపెనీ షేర్లు కొనుగోలు చేస్తే దానిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ప్రతి రూపాయి వైట్ మనీయే.మా బంధువులు అమెరికాలో 30 ఏళ్లుగా సాఫ్ట్వేర్ రంగంలో ఉంటూ, 2010 నుంచి పౌల్ట్రీ వ్యాపారంలో ఉన్నారు. వారు చట్టబద్ధంగా 2019లో ‘రాజ్ బ్రీడర్స్’ అనే కంపెనీ షేర్లను బ్యాంకు చెక్కుల ద్వారా వైట్ మనీతో కొనుగోలు చేశారు. ఇందులో ఎలాంటి అక్రమాలు లేవు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిషేధిత జాబితాలో పెట్టిన భూముల వివరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి.రేవంత్ రెడ్డి గత పదేళ్లలో టిఆర్ఎస్ పాలనలో, ఇప్పుడు మూడేళ్లలో సంపాదించిన ఆస్తులపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మేము డిమాండ్ చేస్తున్నాము అన్నారు.

