నిరుద్యోగులను కలిసే దమ్ముందా రేవంత్?

8
- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అశోక్ నగర్‌కు సినిమా థియేటర్ ఓపెనింగ్‌కు వెళ్తున్నారని, అయితే అదే అశోక్ నగర్‌లో నిరుద్యోగులను కలిసే ధైర్యం ఆయనకు ఉందా అని బీఆర్‌ఎస్ నేత హరీష్ రావు తీవ్రంగా ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ కలిసి అశోక్ నగర్‌కు వచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలు ఎక్కడికి పోయాయని నిలదీశారు.

అశోక్ నగర్‌లోని సినిమా థియేటర్ పక్కనే సెంట్రల్ లైబ్రరీ ఉందని, అక్కడ రోజూ ఉద్యోగాల కోసం చదువుకునే వేలాది మంది నిరుద్యోగులు ఉంటారని హరీష్ రావు తెలిపారు. నిజంగా ధైర్యం ఉంటే ఒక్కసారి అక్కడికి వెళ్లి నిరుద్యోగులను ఎదుర్కొని మాట్లాడాలని సవాల్ విసిరారు. ఇటీవల మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేమని చేతులెత్తేశారని విమర్శించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించిన జాబ్ క్యాలెండర్, చివరికి జాబ్ లెస్ క్యాలెండర్‌గా మారిందని ఎద్దేవా చేశారు.

ఇప్పుడు రేవంత్ రెడ్డి అశోక్ నగర్‌కు వెళ్తున్నప్పుడు వేల మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేసుకున్నారని ఆరోపించారు. మరోవైపు, నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నోటిఫికేషన్లు వేయాలని శాంతియుతంగా నిరసన చేస్తే, పోలీసులు వారిని బూతులు తిట్టి కొట్టారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరుద్యోగుల బాధ అర్థం కావడం లేదని, ప్రజలు ఈ మోసాలను గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు.

Also Read:తరుణ్ ..’ఓం శాంతి శాంతి శాంతిః’!

- Advertisement -