Harishrao:బీజేపీతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదు

13
- Advertisement -

ప్రజల కష్టాల గురించి రాస్తున్న ఇక్కడి కొడంగల్ జర్నలిస్టులకు బెదిరింపులు వస్తున్నాయన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో నిర్వహించిన మహబూబ్‌నగర్ పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న హరీష్..ప్రధాన ప్రతిపక్షంగా ఎన్నికల హామీల అమలుకు పోరాడాల్సిన బాధ్యత మనపైన ఉంది.. ఓడినా, గెలిచినా మనం ప్రజలవైపే అన్నారు.

పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి వంద పథకాలను అమలుచేసింది. మరి బీజేపీ చేసిందేమిటి?,పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి పేదల నడ్డి విరిచిందన్నారు. 20 కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పి 6 లక్షలు కూడా ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేసింది..చెప్పుకోడానికి పథకాలు లేవు కనుక చిత్రపటాలు, అక్షింతలు, చీరలు పంచుతున్నారన్నారు.

తెలంగాణకు మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, నోవదయ స్కూళ్లు ఇవ్వకుండా మొండిచేయి చూపింది బీజేపీ ప్రభుత్వం అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు…కరువు కాటకాలతో అల్లాడే ఈ ప్రాంతానికి కేసీఆర్ నీళ్లిచ్చిండు. ఆరు నెలల్లో పూర్తికావాల్సిన కరివేన ప్రాజెక్టును పూర్తి చేయకుండా రేవంత్ ప్రభుత్వం టెండర్లు రద్దు చేసిందన్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజులు దాటినా అమలు చేయలేదు…సీఎం నియోజకవర్గంలోనే రూ. 2 లక్షల రుణమాఫీ కాలేదు.. రైతులకిచ్చిన రూ. 15 వేల రైతు బంధు, వడ్లకు మక్కలకు రూ. 500 బోనస్ ఇవ్వలేదు. రైతులు చేసేదేం లేక రూ. 1700లకు అమ్ముకుంటున్నారన్నారు.

కేసీఆర్ రైతులకు ఇచ్చి మాట నిలబెట్టుకున్నడు. ఇవ్వని హామీలను కూడా అమలు చేసిండు. 24 గంటల ఉచిత కరెంట్, రైతు బీమా, రైతుబంధు ఇచ్చిండు..ఆసరా పింఛన్ రూ. 4 వేలు ఇస్తామని రేవంత్ అవ్వాతాతలను కూడా మోసం చేసిండన్నారు. నెలకు రూ. 2,500 ఇస్తామని మహిళలను మోసం చేసిండు. కాంగ్రెస్ ఓట్లడగడానికి వస్తే నాలుగు నెలలకు కలిపి రూ. 10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయాలి…నిరుద్యోగులకు రూ. 4 వేలు ఇస్తామని వాళ్లనూ మోసం చేసిండు రేవంత్ . అసలు ఆ హామీనే ఇవ్వలేదని డిప్యూటీ సీఎం అసెంబ్లీ సాక్షిగా చెప్పిండన్నారు. కళ్యాణ లక్ష్మి కింద ఆడపిల్లలకు తులం బంగారం ఇస్తామని అదీ ఎగ్గొట్టిండు. కేసీఆర్ కిట్లు బంద్ అయినవి, తిట్లు స్టార్ట్ అయినవి. కొత్త పథకాలు లేవు. కోత పథకాలు వస్తున్నయ్…హామీలు అమలు చేయడం చేతకాక ఎన్నికల కోడ్‌ను అడ్డం పెట్టుకుంటున్నారన్నారు.

Also Read:అక్కడ ఉప ఎన్నిక.. గెట్ రెడీ?

- Advertisement -