Harish:క్రీడాకారులకు ప్రోత్సాహామేది?

3
- Advertisement -

హైదరాబాద్‌లో ఒలింపిక్స్ నిర్వహిస్తామని ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం.. రాష్ట్రంలోని క్రీడాకారుల సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. క్రీడల అభివృద్ధిపై ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో తీసుకుంటున్న చర్యలకు పొంతన లేదని మండిపడ్డారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసినట్లుగానే క్రీడాకారులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేసిందని ఆరోపించారు.

రేవంత్ రెడ్డి తన ఫుట్‌బాల్ సరదాల కోసం రూ.100 కోట్ల ప్రభుత్వ నిధులు ఖర్చు చేస్తున్నారని, కానీ రాష్ట్రంలోని క్రీడాకారుల కోసం మాత్రం ఎలాంటి ఖర్చు చేయడం లేదని విమర్శించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటే సామర్థ్యం ఉన్న క్రీడాకారులకు సరైన ప్రోత్సాహం అందక వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఖేలో ఇండియా క్రీడలకు ప్రధానమంత్రిని ఆహ్వానిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. రాష్ట్రంలో క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు కోచ్‌లను నియమించాలనే కనీస ఆలోచన కూడా చేయడం లేదని విమర్శించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసే పీఈటీలు, ఫిజికల్ డైరెక్టర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని గుర్తుచేశారు. ఈ పోస్టులను భర్తీ చేయకుండా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే ఆశించిన లక్ష్యాలు ఎలా నెరవేరుతాయని ప్రశ్నించారు. కోచ్‌లు లేకుండా క్రీడాకారులకు ఎవరు మార్గనిర్దేశం చేస్తారని నిలదీశారు.

ఖేలో ఇండియా పోటీల్లో తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటాలంటే ముందుగా అవసరమైన కోచ్‌లను నియమించాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించేందుకు పీఈటీ, పీడీ పోస్టుల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు, నగదు ప్రోత్సాహకాలు అందించాలని సూచించారు.

గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ క్రీడా పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు ప్రయాణ భత్యం (TA), దినసరి భత్యం (DA), ప్రయాణ, వసతి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. క్రీడా బడ్జెట్‌ను పెంచడంతో పాటు కేటాయించిన నిధుల వినియోగంలో పూర్తి పారదర్శకత పాటించాలన్నారు. క్రీడల్లో రాజకీయ జోక్యాన్ని నివారించి, ప్రతిభ ఆధారంగా సమాన అవకాశాలు కల్పించాలని పేర్కొన్నారు.

Also Read:కమీషన్ల మీద ఉన్న శ్రద్ధ రైతులపై లేదా?: కేటీఆర్

తెలంగాణ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటును వేగవంతం చేయాలని, ఆధునిక శిక్షణ కేంద్రాలు, క్రీడా మైదానాలు, అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేశారని ఆరోపిస్తూ, వెంటనే మెగా డీఎస్సీ నిర్వహించాలని కోరారు.

క్రీడారంగ అభివృద్ధి అంటే స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రకటనలు, మైకుల ముందు గొప్పలు చెప్పుకోవడం మాత్రమే కాదని హితవు పలికారు. ఇచ్చిన హామీలను అమలు చేయడం, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సైతం క్రీడల్లో అవకాశాలు కల్పించడమే నిజమైన అభివృద్ధి అని పేర్కొన్నారు. క్రీడాకారుల భవిష్యత్తుతో చెలగాటం ఆడకుండా వారి హక్కులను కాపాడి, ఆశయాల సాధనకు ప్రభుత్వం అండగా నిలవాలని డిమాండ్ చేశారు.

- Advertisement -