ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కోకాపేట భూముల వేలం, రోడ్డు అలైన్మెంట్ మార్పు, ఇళ్ల కూల్చివేత అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ఒకరి అవసరాల కోసం వేలాది మంది పేదల ఇళ్లను కూల్చి వారిని రోడ్డున పడేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
నీ బిడ్డ ఇంటర్నేషనల్ స్కూల్ కోసం మరో స్కూల్‌ను కూల్చేస్తావా రేవంత్ రెడ్డి? అంటూ ముఖ్యమంత్రిని ఉద్దేశించి హరీశ్ రావు ప్రశ్నించారు. కోకాపేటలో గజం రూ.2 లక్షల విలువ చేసే భూమిని కేవలం రూ.47 వేలకే గుట్టుచప్పుడు కాకుండా వేలం వేశారని ఆరోపించారు. సుమారు రూ.110 కోట్ల విలువైన భూమిని రూ.26 కోట్లకే కట్టబెట్టారని విమర్శించారు. ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులో ఉన్నప్పుడు ఇళ్లను కూల్చాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.
రాధా రియల్టర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థకు ప్రయోజనం చేకూర్చేందుకు సుమారు 2 వేల ఇళ్లను కూల్చివేసి, 5 వేల మందిని రోడ్డున పడేస్తారా? అని హరీశ్ రావు నిలదీశారు. ఈ రోడ్డు అలైన్‌మెంట్‌కు సంబంధించి గతంలో జరిగిన పరిణామాలను ఆయన వివరించారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 100 అడుగుల రోడ్డు అలైన్మెంట్ ఇచ్చారని, అయితే ఆ మార్గంలో హనుమంతుడి ఆలయం తొలగించాల్సి వస్తుందని స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారని తెలిపారు. ప్రజల విజ్ఞప్తి మేరకు 2018లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయానికి, ఇళ్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రోడ్డు నిర్మించాలని ఉత్తర్వులు ఇచ్చారని గుర్తుచేశారు.
అయితే 2026లో కాంగ్రెస్ నాయకులు, ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ సంస్థకు ప్రయోజనం చేకూర్చేలా పాత అలైన్‌మెంట్‌ను మార్చి కొత్త ఉత్తర్వులు జారీ చేశారని హరీశ్ రావు ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే ఈ ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో నిర్ణయించిన పాత అలైన్మెంట్ ప్రకారమే రోడ్డు నిర్మాణం చేపట్టాలని స్పష్టం చేశారు.ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నప్పటికీ ప్రజల ఇళ్లను కూల్చివేయడం సరికాదని, వేలాది కుటుంబాల జీవనాన్ని దెబ్బతీయవద్దని ప్రభుత్వాన్ని కోరారు.
Also Read:జానపద రిథమ్ ప్లేయర్లతో ‘ఎల్లమ్మ’

