సీఎం రేవంత్‌కు హరీశ్‌ రావు బహిరంగలేఖ

12
- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డి బహిరంగలేఖ రాశారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పదోన్నతి పొందిన ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించడానికి ముందే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై స్పష్టమైన విధానపర నిర్ణయాలు వెలువరించి, ఆదేశాలు జారీచేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నదని అందులో పేర్కొన్నారు.

పదోన్నతి పొందిన వేలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయులతో మీరు ముఖాముఖి నిర్వహిస్తున్నందుకు అభినందనలు. కానీ రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం తమవి అని చెప్పుకుంటున్న కొన్ని అంశాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలు కావడంతో నిజాలు తెలియజేయలనే ఉద్దేశంతోనూ, అదే విధంగా అమలు చేయవలసిన మీ హామీలతోపాటు వెంటనే పరిష్కరించవలసిన సమస్యలను గుర్తుచేయడానికి, విద్యారంగ ప్రయోజనాల పరిరక్షణ కోసం ఈ లేఖ రాస్తున్నాం.

2017లో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రపంచ తెలుగు మహాసభలలో ఇచ్చిన హామీ మేరకే 10,468 పండిత, పీఈటీ పోస్టుల అప్ గ్రేడేషన్‌కు గత బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్ని రకాల అనుమతులు ఇచ్చింది. మీరు నిర్వహిస్తున్న సభలో సింహభాగం వారే కావడం గమనించాల్సిందిగా సూచిస్తున్నాం.
గత బీఆర్ఎస్ ప్రభుత్వమే భాషాపండితులకు, పీఈటీలకు అడ్డంకిగా ఉన్న సర్వీసు రూల్స్ 11, 12లను మార్చి కొత్తగా 2,3, 9,10 జీఓలను అనుమతించింది.
2023 సెప్టెంబర్ 18న కాళేశ్వరం జోన్ 1లో మా ప్రభుత్వమే 1050 గెజిటెడ్ ప్రదానోపాధ్యాయ ప్రమోషన్లనూ ఇచ్చింది.
ప్రాథమిక పాఠశాలలకు గానూ మా ప్రభుత్వం 10,000 ప్రధానోపాధ్యాయ పోస్టులను మంజూరు చేస్తే ఇప్పటివరకూ పాఠశాలలకు కేటాయించలేదు. వెంటనే కేటాయించి ఎస్జీటీలకు ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.
ప్రస్తుత ఉపాధ్యాయుల పదోన్నతులకు, బదిలీలకు కూడా గతప్రభుత్వమే సెప్టెంబర్ నెలలో లాంఛనాలు పూర్తిచేసింది.
నేడు వేలాది మంది ఉపాధ్యాయులతో తాము నిర్వహిస్తున్న ముఖాముఖిలో మీరు ఎన్నికలకు ముందు ఇచ్చిన కింది హామీలపై స్పష్టమైన విధానపరమైన నిర్ణయాలు వెలువరించి ఆదేశాలు ప్రకటించాలని ఉద్యోగ, ఉపాధ్యాయుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నది.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం మొదటిసారి 43 శాతం, రెండోసారి 30 శాతం ఫిట్‌మెంట్‌ను కల్పించింది. కరోనాతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అతలా కుతలమైనా 30 శాతం పీఆర్సీ ప్రకటించి కేసీఆర్.. ఉపాధ్యాయ ఉద్యోగుల పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. మీరు ఎన్నికల సభలలో మాట్లాడుతూ కేసీఆర్ ప్రకటించిన దానికన్నా గొప్పగా పీఆర్సీని కల్పిస్తామని అన్నారు. కర్ణాటకలో పీఆర్సీ ఇప్పటికే అమలులోకి వచ్చింది, మరి తెలంగాణలో మీరు ఇచ్చిన మాట ప్రకారం మరింత మెరుగైన పీఆర్సీ ఎప్పుడు అమలుచేస్తారో విస్పష్టంగా ప్రకటించాలి, మీరు.. మీ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం కనీసం పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను ఎప్పుడు అనుమతిస్తారో ఆ సంగతన్నా సభలో ప్రకటిస్తే అందరూ సంతోషిస్తారు.
న్యూ పెన్షన్ స్కీం స్థానంలో ఓల్డ్ పెన్షన్ స్కీం తీసుకువస్తామన్నారు. ఎప్పటి నుంచి అమలుచేస్తారో సభలో ప్రకటించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం.
సర్వశిక్షా అభియాన్‌లో సేవలందిస్తున్న ఉద్యోగులను మీ మాటలలో చెప్పాలంటే ‘చాయ్’ తాగినంత వ్యవధిలో క్రమబద్ధీకరిస్తామని మాట ఇచ్చారు. ఇప్పటికి 8 నెలలు కావస్తున్నది. దాని ఊసేలేదు. వారికి ఆశలు చూపించింది మీరే కనుక వారి సమస్యను ఎప్పుడు తీర్చుతారో సభాముఖంగా ప్రకటించండి.
పాఠశాలలకు స్కావెంజర్స్‌ను అనుమతిస్తామన్నారు. అది ఇప్పటివరకూ కార్యరూపం దాల్చలేదు. ఈ విషయమై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వండన్నారు.

- Advertisement -