కాంగ్రెస్ సర్కార్‌పై హరీష్ రావు గర్జన

2
- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సంగారెడ్డి జిల్లాలో దాదాపు 4 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే అత్యంత ప్రతిష్టాత్మకమైన సంగమేశ్వర – బసవేశ్వర ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అటకెక్కించిందని ఆయన ఆరోపించారు. ఈ ప్రాజెక్టుకు తక్షణమే నిధులు కేటాయించి, యుద్ధప్రాతిపదికన పనులు జరపకపోతే ఊరుకునేది లేదని హెచ్చరించారు. జిల్లా రైతాంగాన్ని కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం నిర్మిస్తామని, ఇందులో భాగంగా సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా పాదయాత్ర కార్యక్రమాన్ని కూడా చేపడతామని స్పష్టం చేశారు.

మరోవైపు రాష్ట్ర అప్పుల లెక్కలపై కాంగ్రెస్ ప్రభుత్వంలో నెలకొన్న గందరగోళాన్ని ఆయన తీవ్రంగా ఎండగట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత చేసిన అప్పు రూ. 1,77,058 కోట్లు అని మంత్రి జూపల్లి కృష్ణారావు తనకు ఒక లేఖ రాశారని హరీష్ రావు వెల్లడించారు. కానీ, దీనికి భిన్నంగా నాలుగు నెలల క్రితమే అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు రూ. 3,45,294 కోట్లు అని ప్రకటించారని గుర్తుచేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాలుగు నెలల కిందటే అంత మొత్తం చెబితే, ఆ తర్వాత గడిచిన ఈ నాలుగు నెలల అప్పులను కూడా కలుపుకుంటే ప్రస్తుత అప్పుల భారం ఖచ్చితంగా రూ. 4 లక్షల కోట్లు దాటుతుందని ఆయన అంచనా వేశారు.

ఈ అప్పుల వివరాలపై జూపల్లి ఒక మాట, రేవంత్ రెడ్డి ఇంకో మాట చెబుతూ ప్రజలను అయోమయంలో పడేస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. ప్రభుత్వంలోని ఇద్దరు కీలక వ్యక్తుల మధ్యే లెక్కల్లో ఇంత భారీ వ్యత్యాసం ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లిలలో ఎవరు రాజీనామా చేయాలో తేల్చుకోవాలని హరీష్ రావు సవాల్ విసిరారు.

ALso Read:లాస్ ఏంజిల్స్‌లో క్రికెట్ స్టేడియం

- Advertisement -