కాంగ్రెస్ పాలనలో గురుకులాల్లో మరణ మృదంగం.. 20 నెలల పాలనలో 93 మంది విద్యార్థుల మృతి చెందారు అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. BRS పాలనలో దేశానికి దిక్సూచి.. నేడు దిక్కు మాలిన స్థితి, స్వయంగా మానిటర్ చేస్తానన్న సీఎం మాటలు నీటి మూటలు అన్నారు. గురుకులాల దీన స్థితిపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
హన్మకొండ ధర్మసాగర్ మండలం కరుణా పురం మహాత్మా జ్యోతి బాపూలే బాలుర గురుకుల కళాశాలలో విద్యార్థి మృతి… యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తుప్రాన్ పేట బీసీ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. నల్గొండ జిల్లా దేవరకొండ ఎస్టీ బాలికల గురుకులంలో ఫుడ్ పాయిజన్, 15 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలు అయ్యారు.
మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండలం బీసీ గురుకులంలో పురుగులన్నం మాకొద్దు అంటూ రోడ్డెక్కారు విద్యార్థులు. గురుకులాల్లో జరుగుతున్న మరణ మృదంగానికి ఎవరు బాధ్యులు రేవంత్ రెడ్డి?, గురుకులాల ఖ్యాతి నానాటికి దిగజారుతున్నదంటే దానికి కారకులు ఎవరు రేవంత్ రెడ్డి?, విద్యార్థులకు కడుపు నిండా అన్నం కూడా పెట్టలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా? అన్నారు.
బిఆర్ఎస్ పాలనలో దేశానికే ఆదర్శమైన గురుకులాలు, రేవంత్ పాలనా వైఫల్యం వల్ల నిర్వీర్యం అవుతుండటం దారుణం…విద్యావ్యవస్థ పట్ల కాంగ్రెస్ చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరి వల్ల లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందన్నారు. గురుకులాలపై స్వయంగా తానే మానిటరింగ్ చేస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించి నెలలు గడుస్తున్నా గురుకులాల దుస్థితి మాత్రం మారలేదు… విద్యాసంవత్సరం మొదలైందంటే పిల్లలు బడికి వెళ్లి చదువుకుంటారని సంబుర పడాల్సింది పోయి, వారి ప్రాణాల గురించి ఆందోళన చెందాల్సిన పరిస్థితి తల్లిదండ్రులకు వచ్చింది అన్నారు. గురుకులాల్లో వరుసగా చనిపోతున్న విద్యార్థుల వార్తలు విని ఊళ్లలోని తల్లిదండ్రులు భయపడుతున్నారు… 20నెలల కాంగ్రెస్ పాలనలో 93 మంది విద్యార్థులు మృతి చెందడం అత్యంత బాధాకరమైన విషయం…విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ.. భావి తెలంగాణ భవిష్యత్తును కాంగ్రెస్ ప్రభుత్వం బలిపెడుతున్నది, నాడు దేశానికి దిక్సూచిలా నిలిచిన తెలంగాణ విద్యావ్యవస్థ.. నేడు దిక్కుతోచని స్థితికి చేరింది అన్నారు.
Also Read:Kingdom:కింగ్డమ్ అప్‌డేట్
మాటలే తప్ప చేతలు లేని ముఖ్యమంత్రి నిర్లక్ష్య తీరు వల్ల ఇంకెంత మంది విద్యార్థులు ఆస్పత్రి పాలు కావాలి, ఇంకెందరు ప్రాణాలు కోల్పోవాలి?,రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలకు మెస్ చార్జీలను చెల్లించేందుకు గ్రీన్ చానల్ ఏర్పాటు చేస్తామని ప్రగల్భాలు పలికి ఏడాది గడిచింది తప్ప అమలు జరగలేదు…
ఉడకని అన్నం, నీళ్ళ చారు, నాణ్యత లేని పప్పు తినకలేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేక గుడ్లు, పండ్లు విద్యార్థులు అందించని పరిస్థితి,ఇంకెన్ని రోజులు విద్యార్థులు పస్తులుండాలి, ఇంకెన్ని రోజులు గొడ్డు కారం అన్నం తిని కడుపు నింపుకోవాలి? అన్నారు. గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని, ఫుడ్ పాయిజన్లు నిరోధించాలని, ఆత్మహత్యలు జరగకుండా తక్షణం చర్యలు చేపట్టాలని BRS పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అన్నారు.

