సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్ పల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. కల్లాల్లో రోజుల తరబడి పడిగాపులు కాస్తున్న రైతుల కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల లక్షలాది మంది రైతులు ఇవాళ గోస పడుతున్నారు అన్నారు.
ఈ ప్రభుత్వానికి రైతులంటే పట్టింపు లేదు, లెక్కలేదు. యూరియా సరఫరా, కరెంటు, రైతుబంధు ఇవ్వడంలో ఫెయిల్ అయిన ప్రభుత్వం.. ఆరుగాలం కష్టపడి పండించిన వడ్లను కొనడంలో కూడా పూర్తిగా విఫలమైంది..గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కాదు, ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి.. ఇలా ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా రైతులకు ఇంత బాధ, కష్టం ఎన్నడూ రాలేదు…రాష్ట్రంలో కోటి 40 లక్షల టన్నుల దిగుబడి వస్తుంటే.. నిన్నటి దాకా 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామని చెప్పిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇవాళ 70 లక్షల టన్నులే కొంటామంటున్నారు. అంటే మిగతా 70 లక్షల టన్నులు రైతులు దళారులకు అమ్ముకుని నష్టపోవాలా..వడ్లు కొనడం చేతగాక కేంద్రం మీద నెపం నెడుతున్నారు. కేంద్రం కొనకపోతే ఆనాడు కేసీఆర్ గారు మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీలో ధర్నా చేసి కేంద్రం మెడలు వంచారు అన్నారు.
కేంద్రం కొనకున్నా, రైతులకు నష్టం కలగకుండా కేసీఆర్ గారే కొనుగోలు చేశారు. మీకు చేతనైతే ఢిల్లీ పోయి కొట్లాడండి కానీ రైతులను నట్టేట ముంచకండి.
కొనుగోలు కేంద్రాల్లో తరుగు తీస్తే తోలు తీస్తానని సీఎం రేవంత్ రెడ్డి, కఠిన చర్యలు తీసుకుంటానని మంత్రి ఉత్తమ్ ఏసీ రూముల్లో కూర్చుని డైలాగులు కొడుతున్నారు.
నా నియోజకవర్గంలోని నంగనూరు, ఖానాపూర్, ఖాతా, వెంకటాపూర్, నర్మెట, పాలమాకుల, సిద్దిపేట అర్బన్, ఎన్సాన్ పల్లి, మిట్టపల్లి, రావురూక్ల, రాఘవాపూర్, మల్లారం, సికిందలాపూర్ తదితర గ్రామాల నుంచి రైతులు నాకు ఉదయం నుంచి ఫోన్లు చేస్తున్నారు.మిల్లుల్లో బస్తాకు 43 కిలోలు పెడితేనే దించుకుంటామని మిల్లర్లు రైతులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.దీనివల్ల ఎకరాకు 150 కిలోల చొప్పున రైతులు నష్టపోతున్నారు. ఈ విషయాన్ని డీఎస్ఓ దృష్టికి తీసుకెళ్తే మీరు మిల్లర్లతోనే మాట్లాడుకోండి అని బాధ్యతారాహిత్యంగా సమాధానం ఇస్తున్నారు అన్నారు.
ఏ ఒక్క మంత్రి కొనుగోలు కేంద్రాలకు రావడం లేదు. రైతులు మిట్టపల్లి, నంగనూరు, చిన్నకోడూరులో రాస్తారోకోలు చేస్తున్నా ఈ ప్రభుత్వానికి కనికరం లేదు.
రోహిణీ కార్తె వచ్చినా కొనుగోళ్లు కాక వడ్లు కల్లాల్లోనే మగ్గుతున్నాయి. మూడో వంతు మాత్రమే కొన్నారు, ఇంకా రెండు వంతుల వడ్లు ఆరుబయటే ఉన్నాయి. వర్షాలకు మురుస్తూ వడ్ల కుప్పల మీదనే మెదక్ జిల్లా కొల్చారంలో ఒక రైతు చనిపోయాడు.రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 10-12 మంది రైతులు కల్లాల్లో ప్రాణాలు విడిచారు.
సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో కూర్చుని మిషన్ మోడ్ అని పేపర్ టైగర్ లా డైలాగులు కొడుతున్నాడు. మీ వడ్లు కొనే పద్ధతి చూస్తే నత్తలు కూడా సిగ్గుపడతాయి.
ముఖ్యమంత్రిది మిషన్ మోడ్ కాదు.. కమిషన్ మోడ్. నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో రైతుల కష్టాల గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం బాధాకరం.
మార్చి 22న సిద్దిపేట గడ్డ మీద ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి వచ్చి 45 రోజుల్లో 9 వేల కోట్లు రైతుబంధు వేస్తా అని సీఎం చెప్పాడు. ఇవాళ్టికి 63 రోజులైంది.
ఇంతవరకు రెండు ఎకరాల వారికి తప్ప మిగతా రైతులకు పూర్తి స్థాయిలో రైతుబంధు రాలేదు.కొమురెల్లి మల్లన్న, యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి, ఏడుపాయల అమ్మవారు, మెదక్ చర్చి.. ఇలా కనబడ్డ దేవుళ్లందరి మీద ఒట్లు పెట్టి రుణమాఫీ చేయకుండా మాట తప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.ఎన్సాన్ పల్లి కేంద్రంలో నెలన్నర రోజుల్లో కేవలం ఆరు లారీలు మాత్రమే వచ్చాయి. వానలకు వడ్లు తడిసి, కింద సీసీ లేక మట్టిలో కలిసిపోయి చెదలు పడుతున్నాయి. లారీలు, సంచులు పంపాలని రైతులు మొత్తుకుంటున్నారు.రేవంత్ రెడ్డి ఇప్పటికి 60 సార్లు ఢిల్లీకి ట్రిప్పులు కొట్టిండు. నీ ఢిల్లీ ట్రిప్పులతో మాకు వచ్చిందేమీ లేదు. ముందు ఢిల్లీ ట్రిప్పులు బంద్ చేసి, కొనుగోలు కేంద్రాలకు లారీల ట్రిప్పులు పెంచు.ఎన్సాన్ పల్లిలో కనకయ్య అనే రైతు కనీసం సంచులు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నీ గారడీ మాటలు బంద్ చేసి, తక్షణమే గన్నీ బ్యాగులు పంపించు.ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతూ, మమ్మల్ని వ్యక్తిగతంగా తిడుతున్నారు. మీరు ఎన్ని తిట్టినా పడతాం, కానీ రైతులకు కాంటాలు పెట్టండి, లారీలు పంపండి.నాగలక్ష్మి అనే మహిళా రైతు మక్కలు అమ్మి రెండు నెలలైనా ఇంతవరకు ఒక్క రూపాయి రాలేదు. వెంటనే మక్కలు, సన్ ఫ్లవర్, జొన్నలు అమ్మిన రైతులకు ఆ డబ్బులు ఖాతాల్లో జమ చేయాలి.రెండు, మూడు రోజుల్లో వడ్ల కొనుగోళ్లలో వేగం పెంచి, తరుగు లేకుండా కొని, లారీలు, గన్నీ బ్యాగులు పంపకపోతే.. స్వయంగా నేనే వేలాది మంది రైతులను వెంటబెట్టుకుని వెళ్లి నిరవధిక ధర్నా చేపట్టి కలెక్టరేట్ ను దిగ్బంధం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను అన్నారు.
Also Read:అస్సాం అసెంబ్లీలో UCC బిల్!

