మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి హరీష్ రావు సరికొత్త రికార్డు నెలకొల్పారు. సంగారెడ్డి జిల్లాలో ఒక్కరోజే 15 కార్నర్ మీటింగ్స్‌లో పాల్గొని తన రాజకీయ దూకుడును చాటారు. ఉదయం బాచుగూడ (ఇంద్రేశం) నుంచి ప్రారంభమైన ప్రచారం రాత్రి సంగారెడ్డి వరకు కొనసాగుతూ, జిల్లానంతటా గులాబీ జెండాల సందడి కనిపించింది. అలసట లేకుండా సాగిన ఈ పర్యటన పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.
ఇస్నాపూర్ (చిత్కుల్), ఇంద్రేశం (బాచుగూడ) ప్రాంతాలతో పాటు సంగారెడ్డిలో ఐదు, సదాశివపేటలో మూడు, జహీరాబాద్‌లో మూడు, కోహిర్‌లో రెండు కార్నర్ మీటింగ్స్ నిర్వహించారు. ప్రతి సమావేశంలోనూ గులాబీ నినాదాల హోరు ఉమ్మడి మెదక్ జిల్లాను దద్దరిల్లించింది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు హరీష్ రావుకు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవడం ద్వారా స్థానిక అభివృద్ధిని మరింత వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. గతంలో చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేస్తూ, ప్రజలతో నేరుగా మమేకమయ్యారు. అవిశ్రాంతంగా సాగిన హరీష్ రావు ప్రచారం గులాబీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపగా, రానున్న ఎన్నికల్లో పార్టీ విజయంపై నమ్మకాన్ని మరింత బలపరిచింది.
Also Read:13న తెలుగులో‘చథా పచ్చ’

