తెలంగాణలో నోటిఫికేషన్ల జాతర కొనసాగుతుంది. తాజాగా రాష్ట్రార్థిక మంత్రి హరీశ్ రావు కీలక ప్రకటన చేశారు. త్వరలో గ్రూప్-4ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేస్తుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కేంద్రం ఆగ్నిపథ్ పథకం ద్వారా యువతను ఆగ్నిలోకి నూకేసిందని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సిద్దిపేట మల్టీపర్పస్ హైస్కూలులో పోలీసు శిక్షణ పొందుతున్న 300 మంది అభ్యర్థులకు మంత్రి హరీశ్ రావు సొంత ఖర్చుతో పాలు, ఉడకబెట్టిన కోడిగుడ్లు పంపిణీ చేశారు.
హరీశ్ రావు మాట్లాడుతూ.. పోలీసు ఉద్యోగ సాధనలో కీలకమైన దేహ దారుఢ్య పరీక్షకు అభ్యర్థులు తపనతో సన్నద్ధం కావాలి. పోలీసు కొలువు చేజిక్కించుకునేందుకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని.. శ్రమించి కొలువు సాధించాలని పిలుపునిచ్చారు.
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి 70 రోజుల పాటు ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగార్థులకు సిద్ధిపేట, గజ్వేల్ లో ప్రిలిమినరీ-రాత పరీక్షకు 1030 మందికి శిక్షణ అందించారు. ఈ శిబిరంలో శిక్షణ పొంది 580 మందికి పైగా అభ్యర్థులు అర్హత సాధించారు. ఆసక్తి ఉన్న వారికి రెండో దశలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు. జిల్లాలోని సిద్దిపేట , దుబ్బాక, గజ్వేల్, చేర్యాల పట్టణాల్లో దేహ దారుఢ్య శిక్షణ కార్యక్రమం మొదలు పెట్టినట్లు వెల్లడించారు.
తెలంగాణ ప్రభుత్వం 91 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిందని, వాటిలో 17 వేల పోలీసు ఉద్యోగాలు ఉన్నాయన్నారు. మంత్రి హరీశ్ రావు చొరవతో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల సన్నద్ధతలో భాగంగా జిల్లాలోని నాలుగు పట్టణాల్లో దేహదారుఢ్య శిక్షణ శిబిర తరగతుల కసరత్తులు కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి..