సజ్జనార్‌పై హరీశ్‌రావు సీరియస్

11
- Advertisement -

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విచారణ కొనసాగుతున్న దశలోనే దీనిని అక్రమమని తేల్చడం చట్టవిరుద్ధమని మాజీ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఈ తరహా వ్యాఖ్యలు సిట్ చీఫ్ సజ్జనార్ చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని విమర్శించారు. రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యంలో న్యాయస్థానం తుది తీర్పు ఇచ్చే వరకు ఎలాంటి ఆరోపణనూ నేరంగా పరిగణించరాదన్నది స్థిరమైన న్యాయసూత్రమని ఆయన గుర్తుచేశారు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21లో భాగమైన డాక్ట్రిన్ ఆఫ్ ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్ ద్వారా స్పష్టమవుతుందని తెలిపారు. దర్యాప్తు చేయడం పోలీసుల బాధ్యత మాత్రమేనని, తీర్పు చెప్పే అధికారం వారికి లేదని వ్యాఖ్యానించారు.

ఫోన్ ట్యాపింగ్ చట్టబద్ధత భారత టెలిగ్రాఫ్ చట్టం సెక్షన్ 5(2), ఐటీ యాక్ట్, అలాగే పీయూసీఎల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం న్యాయస్థానమే నిర్ణయించాల్సి ఉంటుందని హరీశ్‌రావు అన్నారు. కానీ సిట్ విచారణ పూర్తయ్యిందని ప్రకటిస్తూ ముందే అక్రమమని చెప్పడం సరికాదని అభిప్రాయపడ్డారు.

సిట్ చీఫ్ వ్యాఖ్యలు దర్యాప్తుపై ముందస్తు అభిప్రాయాన్ని వెల్లడించినట్లుగా ఉన్నాయని, ఇది ఆల్ ఇండియా సర్వీసెస్ (కండక్ట్) రూల్స్–1968కు విరుద్ధమని తెలిపారు. రాజకీయంగా సున్నితమైన అంశంలో ఈ తరహా వ్యాఖ్యలు దర్యాప్తు నిష్పక్షపాతత్వంపై అనుమానాలు కలిగిస్తాయని అన్నారు. దర్యాప్తు న్యాయంగా ఉండడమే కాకుండా న్యాయంగా కనిపించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు పలుమార్లు స్పష్టం చేసిందని గుర్తు చేశారు. విచారణకు ముందే తప్పు జరిగిందన్న భావన ప్రజల్లో న్యాయవ్యవస్థపై విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని హెచ్చరించారు. దర్యాప్తు సంస్థలు స్వతంత్రంగా, వృత్తిపరంగా చట్ట పరిధిలో పనిచేయాలని సూచించారు.

Also Read:కేసీఆర్‌ను కలిసిన గూడెం మధుసూదన్

- Advertisement -